బీహార్‌లో నూతన తేజస్వం..

` తేజస్వీ యాదవ్‌వైపు యువతరం చూపు
` పలు సర్వేల్లో క్రమక్రమంగా మద్దతు పెరుగుతున్న వెల్లడి
` కాలం చెల్లిన నేతగా నితీశ్‌ కుమార్‌ పట్ల విముఖత
` రిజర్వేషన్లు, ఉపాధి, వలసల విషయంలో అధికార పార్టీపై ఆగ్రహావేశాలు
` వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా కనిపిస్తున్న మహాఘఠ్‌బంధన్‌
` అనేక నియోజకవర్గాల్లో కీలకం కానున్న ముస్లింల ఓటు బ్యాంకు
` కేంద్రాన్ని, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నికగా అంచనాలు
పాట్నా, అక్టోబర్‌ 05 (జనంసాక్షి) :
దేశ రాజకీయాలను ప్రభావితం చేసే కేంద్రబిందువుగా బీహార్‌ నిలవనుందా..? పాత తరం నాయకత్వానికి పాతరేసే కార్యాచరణ సిద్ధమైందా..? అంటే అవుననే సమాధానమే ఇస్తున్నారు విశ్లేషకులు. దశాబ్దాల మూసధోరణికి ఇంకో నెలరోజుల్లోనే ముగింపు పలకనుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వలసలు, ఉపాధి, ఆర్థిక స్వావలంబన విషయంలో అసహనంతో ఉన్న బీహార్‌ ప్రజలు.. ఈసారి యువరక్తాన్ని ప్రోత్సహించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా యువత తన బలాన్ని నిరూపించుకోనుంది. ఈ నేపథ్యంలో ఉధృత ప్రచారం, బలమైన ఎజెండాతో ముందుకు సాగుతున్న రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్‌వైపు యువతరం మొగ్గుచూపుతున్నట్టు పలు సర్వేల్లో వెల్లడవుతోంది. తేజస్వీ సహా కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాఘఠ్‌బంధన్‌ కూటమికి సైతం క్రమక్రమంగా మద్దతు బలపడుతున్నట్టు సర్వేల్లో స్పష్టమవుతోంది.
కలం బంటో (పెన్నులు పంచండి) అనే నినాదంతో యువతను విద్య, ప్రగతివైపు మళ్లించే ప్రయత్నంలో తేజస్వీ యాదవ్‌ సఫలీకృతుడయ్యాడు. లాఠీల కు బదులు కలంతో అభివృద్ధి రాయాలని పిలుపునిచ్చిన ఆయన.. సుదీర్ఘ అనుభవమున్న నేతగా, యువత అభిలాషలకు అనుగుణంగా.. 20 ఏళ్లలో చేయని పనులు 20 నెలల్లో చేస్తానని ప్రకటిస్తున్నాడు. యువతకు ఉద్యోగాలు, విద్య, ఆర్థిక స్వావలంబన వాగ్దానాలు చేస్తున్నాడు. ప్రస్తుత సీఎం నితీశ్‌ కుమార్‌ సర్కారును ఇరవై ఏండ్ల పాత కారుగా విమర్శిస్తూ.. యువతకు అవకాశాలివ్వాలనే నినాదాన్ని ఎత్తుకున్నాడు. అందుకే సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ యువ నేత తేజస్వీ యాదవ్‌కే మద్దతు ఉన్నట్టు సీ ఓటర్‌ సర్వేలో వెల్లడ్కెంది. ఈ సర్వేలో 40.6శాతం మంది తేజస్వీని బలపరిచారు. ఆయన చేపట్టిన బీహార్‌ అధికార్‌ యాత్ర కూడా ఆర్జేడీ కార్యకర్తలను ఉత్తేజపరిచింది. యాదవుల్లోనూ సింహభాగం తేజస్వి నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారు.

కీలకంగా ముస్లిములు
ఎన్‌డీయే, మహాఘఠ్‌బంధన్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న దరిమిలా యువతతో పాటు బీహార్‌ రాష్ట్రంలో ముస్లింల ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. వివిధ సంస్థలు చేపట్టిన సర్వేల్లోనూ ఇరు కూటములు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నప్పటికీ.. అంతిమంగా మహాఘఠ్‌బం ధన్‌వైపై అత్యధికులు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఓట్ల చోరీ, నిరుద్యోగం, వలసలు, విద్య అంశాలపై ఉద్యమాలతో ఎన్నికలకు ముందు మహాఘఠ్‌బంధన్‌ బలం మరింత పుంజుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్న 38 జిల్లాల్లోనూ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిములు ప్రభావితం చూపనుండటం గమనార్హం. వారి ఓటు బ్యాంకు ఈసారి ఏకపక్షంగా మహాఘఠ్‌బంధన్‌వైపే ఉండనుంది. ఎన్‌డీయేతో భాగస్వామిగా ఉన్నందు వల్లనే జేడీయూను ముస్లిం ఓటర్లు వ్యతిరేకిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

వెనుకబడినవర్గాలకు తేజస్వి భరోసా
బీహార్‌లో దశాబ్దాలుగా వెనుకబడిన కులాల్లో విద్య, ఉపాధి కరువైంది. ఈ కారణంగా యువతలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. అందుకే తేజస్వి యాదవ్‌.. ముసహర్‌ భుయాంల వంటి వెనుకబడిన కులాల్లోని యువతను కూడా ఆకర్షిస్తూ పేదరిక నిర్మూలన, ఇళ్లు, ఉద్యోగాలు వాగ్దానాలు చేస్తున్నాడు. ఫలితంగా సీఎంగా ఆయనను అత్యధికులు ఇష్టపడుతున్నారు. ఈ విషయంలో నితీశ్‌కుమార్‌కు సగం కూడా మద్దతు లభించలేదు. ఇది యాదవ్‌, ముస్లింలు, యువతలో మహాఘఠ్‌బంధన్‌ మద్దతు బలపడుతున్నట్టు సూచిస్తోంది. ఎన్‌డీయే ప్రభుత్వంపై అవినీతి, నియామకాల కొరత, పేపర్‌ లీక్‌లు వంటి ఆరోపణలు ఈ ఎన్నికల్లో బలహీనతలుగా మారాయి. ఇక ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ జన సురాజ్‌ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బీహార్‌ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, మార్పు తథ్యమని తేజస్వీ ప్రకటించడం ఎన్‌డీయే కూటమిలో గుబులు రేపుతోంది. రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్లు, ఉద్యోగాలు వంటి అంశాలపై యువత మద్దతు మరింత పెరిగితే బీహార్‌ రాజకీయాల్లో కొత్తశకం మొదలుకావడం ఖాయం..!