అన్నా బృందం మలిదశ పోరు
దీక్ష ప్రారంభం
న్యూఢిల్లీ, జూలై 25 : పటిష్టమైన లోక్‌పాల్ బిల్లును తీసుకురావటంతో పాటు ఎంపిలపై నమోదైన కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నా హజారే బృందం బుధవారం నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష ప్రారంభించింది. ఉదయమే అన్నా హజారే మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి తదనంతరం దీక్షాస్థలికి చేరుకున్నారు. వందేమాతరం ఇంక్విలాబ్ అనే నినాదాలిస్తూ వారికి మద్ధతుగా దీక్షలో కూర్చుకున్నారు. 75ఏళ్ళ అన్నా హజారే ఈ దీక్షలలో జూలై 29 నుంచి నిరవధికంగా పొల్గొననున్నారు. అన్నా హజారే బృందంలోని అరవింద్‌క్రేజివాల్ మనీషా సిసోడియా, గోపాల్ రాయ్ పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్దకు అరవింద్ క్రేజివాల్ రాగానే ఎన్‌ఎస్‌యుఐకి చెందిన కార్యకర్తలు కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా ఈ దీక్షస్థలికి కిరణ్‌బేడి కూడా హజరయ్యారు. దీక్షా సమయంలో ప్రభుత్వం ఏ చేస్తుందో చూద్దాం, మూడు నాలుగు రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే జైలు బరో చేపట్టి జైళ్ళకు వెళతామని అన్నా హజరే ఒక విడియో సందేశాన్ని విడుదల చేస్తూ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో ఒక్కజైలు కూడా లేకుండా, తన కార్యకర్తలతో నింపేస్తామని దీనిని రెండవ స్వాతంత్య్ర సంగ్రామంగా భావించాలని ఆయన తన సందేశంలో పిలుపునిచ్చారు.