అన్నింటా వివక్ష తెగిస్తేనే తెలంగాణ

మహా నిరసనలో కోదండరామ్‌
హైదరాబాద్‌, జూన్‌ 17 (జనంసాక్షి) :
సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాంతానికి అన్నింటా వివక్ష ఎదురవుతోందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. సోమవారం విద్యుత్‌ సౌధ ఎదుట విద్యుత్‌ ఉద్యోగులు చేపట్టిన మహా నిరసన కార్యక్రమంలో కోదండరామ్‌ పాల్గొని ఉద్యోగులకు సంఫీుభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర పాలకులు అన్ని రంగాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన అవకాశాలను గద్దల్లా తన్నుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సౌధలో తెలంగాణకు దక్కాల్సిన రెండు డైరెక్టర్‌ పోస్టులు ఎగరేసుకుపోయేందుకు సీమాంధ్ర పాలకులు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. ఇందుకోసం ఇంటర్వ్యూలు అదీ, ఇదీ అంటూ హంగామా సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ కుట్రలను తిప్పికొడుతామని స్పష్టం చేశారు. చలో అసెంబ్లీ సందర్భంగా ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తించిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని త్వరలోనే తగినరీతిలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. డైరెక్టర్‌ పోస్టులు తెలంగాణ వారికే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణ కోసం ఎవరూ ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, హరీశ్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, చెన్నమనేని రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.