అన్నిరంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ

రోడ్ల నిర్మాణంలో ఆదర్శంగా నిలిచాం

మంత్రి తుమ్మల

ఖమ్మం,జూలై24(జ‌నంసాక్షి): తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా మారిందని రోడ్లు,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంతో పాటు, జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై మంత్రి తుమ్మల సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయన్నారు. దేశానికి దిక్సూచి తెలంగాణెళినని సీఎం కేసీఆర్‌ నిరూపించారన్నారు. ప్రజాసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను మిగతా రాష్ట్రాలన్ని ఆసక్తిగా గమనిస్తున్నా యన్నారు. పాలేరు నియోజకవర్గంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని అన్నారు. కొత్తగా మరో వేయి ఇండ్ల మంజూరు కాబోతున్నాయని వాటిని కూడా డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని అన్నారు. గతంలో 1400 ఇండ్లు కొత్తగా రాబోయే 1000 ఇండ్ల నిర్మాణం వేగంగా నాణ్యతతో జరిగేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. జోరుగా వర్షాలు వస్తున్నందున చెక్‌డ్యాంలలో నీరు నిల్వ

ఉండేలా చూడాలన్నారు. కొత్తగా నిర్మిస్తున్న చెక్‌డ్యాంలు త్వరగా పూర్తిచేస్తే రైతులకు ఉపయోగ పడతాయని అన్నారు. గతంలో రహదారులు లేక ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గడిచిన నాలుగేళ్లలో వీటన్నింటిని మార్చేశామని తెలిపారు. గ్రామంలో ఎక్కడ బురద కనిపించకుండా సీసీ రోడ్లు వేయించామని అన్నారు. ఏదైనా ఆపదోస్తే నియోజకవర్గ కేంద్రానికి చేరుకోవడానికి రోడ్లు నిర్మించి ప్రయాణాన్ని సులువు చేశామని తెలిపారు. ఏజెన్సీలో జీవిస్తున్న నిరుపేదలకు సీఎం కేసీఆర్‌ డబుల్‌బెడ్‌రూం ఇళ్లనిచ్చి వారి గుండెల్లో నిలిచారన్నారు. ఊపిరి ఉన్నంత వరకు సీఎం కేసీఆర్‌ను గిరిజన ప్రజలు గుర్తు పెట్టుకునేలా చేశారని తెలిపారు. ప్రస్తుతం ఎల్‌డబ్ల్యూఈ లో భాగంగా జిల్లాకు ఈ దఫా రూ.300 కోట్లు మంజూరయ్యాయని, అందులో అత్యధికం ఇల్లెందు ఏజెన్సీకి ఖర్చు చేస్తామన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నియోజకవర్గానికి దేవాలయం లాంటిందని మంత్రి పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యే అధికారిక భవనంగా క్యాంపు కార్యాలయం ఉంటుందని ఇక్కడి నుంచే నియోజకవర్గ పరిపాలన కొనసాగుతుందన్నారు. హరితహారంలో అందరూ పాల్గొని మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని, నాటిన మొక్కలను బతికించాలన్నారు. పచ్చని చెట్లతోనే ఆరోగ్యమని, ముందుతరాలకు మంచి జరగాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పెంచాలన్నారు. అడవులను పెంచుకుంటేనే ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుందన్నారు. అందరి భాగస్వామ్యంతోనే హరితహారం విజయవంతం అవుతుందన్నారు.