అన్ని అంశాలు పరిశీలించాకే బీహార్‌ ఎన్నికలు : ఈసీ

2

న్యూఢిల్లీ , మే 17(జనంసాక్షి) : జాతీయ రాజకీయాల్లో బీజేపీ హవా, జనతాపరివార్‌ ఏర్పాటు తదితర పరిణామాల నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ లో జరగనున్నాయి. వాతావరణ పరిస్థితులు, సెలవు దినాలు తదితర అంశాలను పరిశీలించిన పిదప పోలింగ్‌ తేదీపై తుది నిర్ణయం ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) నదీం జైదీ చెప్పారు. ఆదివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ‘బీహార్‌ ఎన్నికలు.. దేశంలో నిర్వహించే మిగతా  ఎన్నికలకంటే విభిన్నమైనవేకాదు, అతి ప్రధానమైనవి కూడా. అందుకే వాటి నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.

జులై 31 నాటికి ఓటరు జాబితా సిద్ధమవుతుందన్న జైదీ.. షెడ్యూల్‌ విడుదలపై కసరత్తు మొదలైందన్నారు. ఎన్ని దశల్లో పోలింగ్‌ ఉంటుందన్న ప్రశ్నకు సమాధానమివ్వలేదు. ‘నగదు పంపకం బీహార్‌ ఎన్నికల్లో ప్రధాన సమస్యగా మారింది. దీనిని అరికట్టేందుకు నిబద్ధతతో కూడిన చర్యలు చేపట్టాలనుకుంటున్నాం. ఇందుకు సంబంధించి కొన్ని చట్టాలను మార్చాల్సిందిగా కేంద్ర న్యాయశాఖకు విన్నవించాం. త్వరలోనే ఆ విషయం ఓ కొలిక్కి వస్తుంది’ అని జైదీ అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతాబలగాలను అదనంగా మోహరిస్తామన్నారు.