అన్ని రంగాల్లో విఫలం
కడప, ఆగస్టు 3 : ప్రభుత్వం అన్ని రంగాల్లోను పూర్తిగా విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ప్రభుత్వం పరిపాలనా రంగాల్లో అవినీతిని పెంచి పోషిస్తోందని ఆయన దుయ్యబట్టారు. అవినీతికి వ్యతిరేకంగా యువతను చైతన్యవంతులను చేసేందుకు ఈ నెల 12న హైదరాబాద్‌లో ఎఐవైఎఫ్ నిర్వహించనున్న రాష్ట్ర సదస్సుకు జిల్లాలోని యువత పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నదని చెప్పారు. యువత తన ఉజ్వల భవిష్యత్తుకు అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు ఎక్కడ చూసినా నలుగురు గుమికూడిన ప్రాంతంలో అవినీతిపై చర్చ తప్పా మరొకటి జరగడం లేదని ఆయన అన్నారు. దీన్ని బట్టి అవినీతి ఏ స్థాయికి చేరిందో యువత ఒక్కమారు ఆలోచించాలని ఆయన సూచించారు. తమ భవిష్యత్తుతో పాటు భావి తరాలకు నీతివంతమైన సమాజాన్ని అందించేందుకు యువత నేడు నడుం బిగించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.