అన్యాయాన్ని న్యాయంతో ఎలా జతచేస్తావ్‌

ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అతి విచిత్రమైన ప్రకటన చేశాడు. ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలు గౌరవిస్తామని గొట్టాల ముందు సెలవిచ్చారు. ఇరు ప్రాంతాల మనోభావాలు ఏమిటో ఆయనే చెప్పాలి. సీమాంధ్ర ప్రాంతీయులకు గతంలో ఎమైనా మనోభావాలు ప్రత్యేకంగా ఉండేవా? ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగిన బొత్సకు ఆ ప్రాంత ప్రజల మనోభావాలు ఏమిటో తెలియవా? 2009 డిసెంబర్‌ 9కి ముందు వారికి ఎలాంటి మనోభావాలు ఉన్నాయో ఆయన గుర్తించలేకపోయారా? ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స సత్సనారాయణ రాష్ట్రమంతటికి ప్రాతినిధ్యం వహించేలా మాట్లాడుతానంటే ఎవరికేం అభ్యంతరం ఉండదు. కానీ ఉన్నట్టుంది తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షం నిర్వహించబోతుండగా ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలు గౌరవిస్తామనడం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఇక్కడి ప్రజలు కొత్తగా అడుగుతున్నారా? ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆంధ్ర ప్రాంతాన్ని విడదీయాలని డిమాండ్‌ చేస్తూ జై ఆంధ్ర ఉద్యమాన్ని నడిపిన రోజులను బొత్స మర్చిపోయారా? హైదరాబాద్‌ రాష్ట్రాన్ని సమైక్యాంధ్ర ప్రాంతంలో విలీనం చేసిన రోజు నుంచే ఇక్కడి వారు ఆత్మగౌరవం కోసం పోరాడుతూనే ఉన్నారు. ‘అమాయక తెలంగాణను జిత్తులమారి ఆంధ్ర’తో కలిపి పెళ్లి చేస్తున్నామని, ఎవరికి ఇష్టం లేకున్నా పేటాకులు చేసుకోవచ్చని అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ ఆరోజే వ్యాఖ్యానించారు. అంటే ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో భాగస్వామిగా ఉన్న ఆంధ్ర నేతల జిత్తులమారి రాజకీయాలు పండిట్‌కు అప్పటికే తెలుసు. ఆ తర్వాత సీమాంధ్రుల పాలనలో తెలంగాణకు ఎంతగానో అన్యాయం జరిగింది. దీంతో స్వరాష్ట్రం కోసం, ఆత్మగౌరవం కోసం ఉద్యమబాట పట్టారు. 1969లో వెల్లువెత్తిన ఉద్యమంలో సీమాంధ్ర సర్కారు సుమారు నాలుగు వందల మంది తెలంగాణ విద్యార్థులను పొట్టనబెట్టుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యమం ఏదో ఒక రూపంలో తెలంగాణ ప్రజలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆత్మగౌరవ నినాదం, స్వపరిపాలన, దోపిడీ నుంచి విముక్తి కోసం ఎన్నో సంఘాలు పోరుదారిన నడిచాయి. నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు తమ ఆత్మగౌరవం కోసం పోరాడుతూనే ఉన్నారు. 2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఉద్యమానికి రెండోసారి రాజకీయ అండ దొరికింది. ప్రజల మనోభావాలను ప్రతిఫలింపజేసే వేదిక దొరకడంతో ప్రజా, స్వచ్ఛంద, కళాసంఘాలు అండగా నిలిచాయి. తర్వాత చిన్నచిన్న పొరపొచ్చాలొచ్చినా ఎవరూ పోరుదారి వీడలేదు. ఇందుకు కారణం తెలంగాణ ప్రజల మనోభావం ఒక్కటే.. అదే స్వరాష్ట్రం. కానీ సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఎన్నడూ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగాలిని కోరుకోలేదు. వారికి హైదరాబాద్‌లో ఉద్యోగాలు రావని, హైదరాబాద్‌ మనది కాకుండా పోతుందని సీమాంధ్ర ప్రాంత నేతలు ప్రజలను రెచ్చగొట్టే వరకు వారికి దీనిపై ఎలాంటి అభ్యంతరాలు లేవు. ప్రజాప్రతినిధులు లైను కట్టి రాజీనామాలు చేస్తుంటే ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందని అక్కడి ప్రజలు భయాందోళనలు చెందారు. అంతే తప్ప వారికి వేరే మనోభావాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కావాలనేది సీమాంధ్ర ప్రాంతంలోని ఎక్కువ మంది ప్రజలు కోరుకోవడం లేదని ప్రత్యేక ఆంధ్ర కోసం ఉద్యమాన్ని నడిపిస్తున్న సంఘాలు ఎలుగెత్తిచాటుతున్నాయి. సమైకాంధ్ర పేరుతో రోడ్డుపై ఆందోళనలు చేస్తున్న గుంపుల్లో ఎక్కడా పట్టుమని పదికంటే ఎక్కువ కనిపించరు. అంటే అక్కడి ప్రజల మనోభావాలు ఏమిటి? ఈ విషయం బొత్సకు తెలియని కాదు. సమైక్యాంధ్ర రాష్ట్రం కోరుకునే వారు అక్కడి ప్రజలు కాదు కేవలం పెట్టుబడీదారులు. అంటే బొత్స దోపిడీదారుల మనోభావాలతో దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజల మనోభావాలతో జత చేయడం ఎంతవరకు సమంజసం. అదే ఆయన విధానమైతే కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ప్రజల మనోభావాలు అవసరం లేదా? ఈ విషయాన్ని ఢిల్లీలో ఉన్న అధిష్టానం పెద్దలు గుర్తిస్తారో.. ఇక్కడి పాలకులు తెలుసుకుంటారో వారిపైనే వదిలేయాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నారు తమ మనోభావాలు పట్టని కాంగ్రెస్‌ను తాము వదిలేస్తామని.