రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు

 

 

 

 

 

 

హైద‌రాబాద్ ( జనంసాక్షి):   ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండ‌లం మ‌ల్లారం గ్రామంలోని వ‌డ్ల కొనుగోలు కేంద్రాన్ని హ‌రీశ్‌రావు ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. ఇప్పటివరకు కొన్నది కేవలం ఐదారు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే అని తెలిపారు. 85 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల వ‌డ్లు కొంటామ‌ని చెప్పి ఐదారు ల‌క్ష‌ల‌కే ప‌రిమిత‌మైంద‌ని మండిప‌డ్డారు. కొన్న వాటికి కూడా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

దాదాపు రూ. 1200 కోట్ల వరకు ఎంఎస్పీ పెండింగ్‌లో ఉంది. దాదాపు రూ. 200 కోట్ల బోనస్ పెండింగ్‌లో ఉంది. మాటల్లో 24 గంటల్లో బోనస్ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పోయిన యాసంగి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వడ్లను కొనుగోలు వేగవంతం చేయండి అని హ‌రీశ్ రావు సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చలిలో రైతులు పడిగాపులు కాస్తున్నారు. కావున వీలైనంత త్వరగా కొనుగోలు చేయండి. దయచేసి మిల్లులు టై అప్ చేయండి. పోయిన యాసంగి, ఈ వానకాలం బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న. మక్క రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ రాష్ట్రంలో మక్కలు పండించిన రైతులకు మక్క కొనుగోల్లను ఆలస్యం చేసారు. ముఖ్యమంత్రి మక్కల కొనుగోలును నిర్లక్ష్యం చేస్తున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎకరాల్లో మక్కలు పండించారు. వెంటనే మక్క రైతులకు డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పత్తి రైతుల పరిస్థితి కూడా ఆగం అయ్యింది అని హ‌రీశ్‌రావు తెలిపారు.

కేంద్ర బీజేపీ రైతులను అరిగోస పెడుతున్నది. ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటాం అంటే కొన్ని జిల్లాలో 11, 12 క్వింటాళ్ల పత్తి పండింది. వాళ్లు మిగిలిన పత్తిని ఏం చేయాలి. ఒకవైపు జిన్నింగ్ మిల్ వాళ్ళు, మరోవైపు కేంద్ర ప్రభుత్వ సిసిఐ పత్తి కొనుగోలు సరిగ్గా చేయడం లేదు. పత్తి రైతులు అప్పులపాలు అయిపోయి రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. పత్తి రైతులకు బీజేపీ ప్రభుత్వం, మక్క రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నది. రేవంత్ రెడ్డి రైతులను అన్ని రకాలుగా మోసం చేశాడు. రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు.. బోనస్ లేదు, పంటల బీమా లేదు.. సగం మందికే రుణమాఫీ చేశారు. పోయిన యాసంగిలో వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు, ఈ ఏడాది తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందలేదు. పంటల బీమా చేసి ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా డబ్బులు వచ్చేవి. త‌క్షణమే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.