అప్పన్న సేవలో మంత్రులు

విశాఖపట్టణం,జూలై2(జ‌నం సాక్షి ): మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావులు సోమవారం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు, వేద పండితులు మంత్రులకు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ అధికారులు మంత్రులకు తీర్ధప్రసాదాలను అందచేశారు. విశాఖలో వివిధ కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారు. ఇదిలావుంటేశ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామికి భక్తి శ్రద్ధలతో ఆదివారం గరుడసేవ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత స్వామికి వేకువజామున సుప్రభాత సేవ ఆరాధన జరిగింది. అనంతరం స్వామికి పట్టు పీతాంబరాలు సర్వాభరణాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఉభయ దేవేరులను ఆస్థాన మండపంలో అధిష్ఠింపజేశారు. వేద మంత్రాలు మోగుతుండగా స్వామి నిత్య కల్యాణం కమనీయంగా జరిగింది. తర్వాత స్వామి ఉత్సవ మూర్తిని గరుడ వాహనంపై అధిష్ఠింపజేశారు. అర్చకులు స్వామికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు వింజామర సేవలు చేశారు. పూజలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.