అప్పులతో ఎపి సర్కార్‌ సంసారం

జీతాలకు కూడా కటకటలాడాల్సిన దుస్థితి
విమర్శించే వారిపై ఎదురుదాడితో సరి
అమరావతి,ఆగస్ట్‌13(జనంసాక్షి): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఎవరు తీరుస్తారని నిలదీసిన ప్రస్తుత ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇప్పుడు అప్పు చేయడంలో తప్పు లేదని వాదిస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ..జీతాలకు కూడా డబ్బులు లేవన్న విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పుతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్న లేదా విమర్శలు చేస్తున్న వారిపై ఎదురుదాడికి దిగుతున్నారు. రాష్టాల్రు ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా చూడడం కోసం రాజ్యాంగంలోనే కొన్ని నిబంధనలను పొందుపర్చారు. ఇప్పుడు జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఈ నిబంధనలను ఉల్లంఘించిందన్నది ప్రధాన ఆరోపణ. వచ్చే పదిహేనేళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని తనఖాగా పెట్టి 25వేల కోట్ల రూపాయలను రాష్టాభ్రివృద్ధి కార్పొరేషన్‌ పేరిట అప్పు చేయడం, ఈ మొత్తాన్ని నిర్దేశిరచిన లక్ష్యం కోసం కాకుండా ఇతరత్రా అవసరాలకు ఖర్చు చేయడంతో జగన్‌ ప్రభుత్వం వివాదంలో చిక్కుకుంది. అయిదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం లక్షా 30వేల కోట్ల రూపాయలు అప్పు చేసినందుకే అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్‌ అండ్‌ కో తీవ్రంగా ఆక్షేపించారు. ఇప్పుడు ఐదేళ్లు పూర్తయ్యేసరికి జగన్‌ ప్రభుత్వం చేసే అప్పు అయిదు లక్షల కోట్ల రూపాయలు దాటిపోతుందని ఆర్థికనిపుణుల అంచనా. ఎడాపెడా అప్పులు చేస్తున్నప్పటికీ ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి లేకుండా పోయింది. జీతాల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా నిధుల కొరత ఎదుర్కొంటోంది. రెండేళ్లలో జగన్‌ ప్రభుత్వం చేసిన అప్పు లక్షా 70వేల కోట్లే కాకుండా పెండిరగ్‌లో ఉన్న బిల్లుల విలువ 20 వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు చేరింది. అంటే దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల వరకు కొత్తగా అప్పు
చేశారని తెలుస్తోంది. సంక్షేమం పేరుతో మితివిూరిన పందేరాలు తోడవ్వడంతో లోటు పెరుగుతోంది. దీనికితోడు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుప్పకూలింది. మరోవైపు జీతాలు సకాలంలో అందని కారణంగా ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. అప్పుల తప్పులకు సంజాయిషీ ఇవ్వడమే తన ప్రధాన కర్తవ్యం అన్నట్టుగా రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
రాష్టాభ్రివృద్ధికి దోహదపడే చర్యలను తీసుకోకపోగా రాజకీయ కక్ష సాధింపులు, జనాకర్షక విధానాలపైనే మొత్తం దృష్టి కేంద్రీకరించడం అనర్థదాయకమని వాపోతున్నారు. నిధుల కొరతతో సంక్షేమ కార్యక్రమాల అమలు కుంటుపడితే కేంద్రంలోని బీజేపీయే అందుకు కారణమని విమర్శలు అందుకున్నారు. స్వయం కృతాపరాధం వల్ల ముంచుకొస్తున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడతార్నదే ఇప్పుడు ప్రశ్న.