అప్పుల తెలంగాణ మార్చిండు

– నాలుగేళ్లలో రూ.2.25లక్షల అప్పులు చేశారు
– మద్యాన్ని ఏరులై పారిస్తూ తాగుబోతు తెలంగాణగ మార్చారు
– వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు
– జనచైతన్య రథయాత్రలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌
రంగారెడ్డి, జూన్‌26(జ‌నం సాక్షి) : నాలుగేళ్ల పాలనలో కేసీఆర్‌ తెలంగాణను అప్పుల తెలంగాణ మర్చిండని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం పిరమిడ్‌ వద్ద బీజేపీ జన చైతన్య రథయాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రూ. 60000 వేల కోట్ల అప్పులు ఉన్న రాష్ట్రం, తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు  రూ. 2లక్షల 25వేల అప్పులు చేసి అప్పుల తెలంగాణగా మార్చారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ యాత్రలను బీజేపీ కాపీ కొడుతుందని ఆరోపిస్తున్నారు..  అసలు బీజేపీ యాత్రల ద్వారానే పుట్టిందని కాంగ్రెస్‌ పార్టీ నేతలు  గుర్తించాలని లక్ష్మణ్‌ వివరించారు. తెలంగాణలో మద్యాన్ని ఏరులై పారిస్తూ తాగుబోతుల తెలంగాణ మార్చేస్తున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ అమర వీరుల త్యాగాల పునాదులపై ఆ నలుగురు రాష్టాన్ని పాలిస్తున్నారని దుయ్యబట్టారు. స్వరాష్ట్రంలో మరో ఉద్యమానికి తెరలేచిందన్నారు. మతోన్మాద పార్టీ ఎంఐఎంతో కలిసి (మజ్లిస్‌) ఎజెండా అమలు చేస్తున్న కేసీఆర్‌ను గద్దె  దింపే రోజులు ఎంతోదూరంలో లేవన్నారు. ప్రజా కోర్టులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామన్నారు.  విూ మంత్రులు, ఎమ్మెల్యేలపై నమ్మకం ఉంటే మరోసారి గెలిపించుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేసిన జిమ్మికులు సాధారణ ఎన్నికల్లో సాగవనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రోడ్డుపై గుంత కనిపిస్తే రూ.1000 లు ఇస్తామని చెప్పిన కేటీఆర్‌ నిజంగా డబ్బులివ్వానుకుంటే రాష్ట్రంలో రోడ్లపై ఉన్న గుంతలకు రాష్ట్ర బడ్జెట్‌ కూడా సరిపోదని ఎద్దేవా చేశారు. కారు వారిదే కానీ.. స్టీరింగ్‌ నా చేతుల్లో ..ఉందని బాహాట్టంగానే అసద్దుదీన్‌ ఓవైసీ వ్యాఖ్యానిస్తున్నా సీఏం కేసీఆర్‌ వారిని ఏమి చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఇంటికి పంపడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని.. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? అని ఎదురు చూస్తున్నారని చెప్పారు.
——————-