అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
జగదేవ్ పూర్, అక్టోబర్ 20 (జనంసాక్షి):
అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండల పరిధిలోని మునిగడప మధిర గ్రామం గోపాల్ పూర్ లో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోపాల్ పూర్ గ్రామానికి చెందిన బొగ్గుల నాగయ్య (48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయభూమిలో పత్తి, వరి పంటలను సాగు చేశాడు. వర్షభావ పరిస్థితుల వల్ల గత మూడేళ్లుగా పంటలు సరిగా పండకపోవడంతో పంట పెట్టుబడి కోసం, ఇంటి నిర్మాణం కోసం వడ్డీ వ్యాపారస్తుల వద్ద చేసిన అప్పులు నాలుగు లక్షల రూపాయల వరకు అయ్యాయి. కాగా ఈ యేడు పంటలు సరిగా పండితే అప్పులు తీర్చవచ్చు అనుకుంటే అధిక వర్షాల కారణంగా పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతు నాగయ్య తీవ్ర మనోవేదన చెంది ఈనెల 19వ తేదీన వ్యవసాయ పొలం వద్ద నుండి ఇంటికి వచ్చి పురుగుల మందు తాగడు. గమనించిన కుటుంబీకులు వెంటనే చికిత్స నిమిత్తం నాగయ్యను గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు గాందీ ఆసుపత్రికి తరలించగా అక్కడ రెండు రోజులుగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ క్రమంలో మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.