అబద్దాలతో అభివృద్ది ప్రచారం

అబద్దాలతో అభివృద్ది ప్రచారం
క్షేత్రస్థాయిలో వెక్కిరిస్తున్న నిజాలు
బహిరంగ మలవిసర్జన, విద్యుత రంగాల్లో అసత్యాలు
లెక్కలు మార్చినంత మాత్రాన దాగని సత్యాలు

న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి):ప్రభుత్వాలు ఉన్నదానికి అతిశయం జోడిరచి ఎక్కువచేసి చెప్పుకోవడం సహజం. కానీ మోడీ ప్రభుత్వం లేనిదానిని కూడా ఉన్నట్టుగా, జరగనిదానిని జరిగినట్టుగా చెప్పడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. అతిశయాలకు కూడా ఓ హద్దు ఉండడం లేదు. లోపాలను అంగీకరించలేకపోవడం కనిపిస్తోంది. గతంలో భారత్‌ వెలిగిపోతోందన్న ప్రచారాన్ని మించి ఇప్పుడు మోడీ ప్రభుత్వ ప్రచారాలు సాగుతున్నాయి. ప్రజలు ఏమనుకుంటారో అన్న ఆలోచన ఉండడం లేదు. బహిరంగ మలవిసర్జన నుంచి గ్రావిూణభారతం పూర్తిగా విముక్తి చెందిందని ప్రభుత్వం చేస్తున్న వాదనలో నిజం లేదని వాస్తవాలు చెబుతు న్నాయి. 4371 నగరాలను ఈ విధంగా ప్రకటించినట్టు, పారిశుద్ధ్యం నూరుశాతం మెరుగుపడినట్టు, 11కోట్ల ఇళ్ళలో మరుగుదొడ్లు నిర్మించినట్టు ప్రభుత్వం లెక్కలు చెప్పింది. సౌత్‌ ఏషియన్‌ లేబర్‌ నెట్‌వర్క్‌ గత ఏడాది చేసిన సర్వే ప్రకారం భారత జనాభాలో 45 శాతం ఇంకా బహిరంగ విసర్జననే పాటిస్తున్నారు. పన్నెండులక్షల మరుగుదొడ్లు ఇంకా నిర్మించాల్సి ఉంది. ఇక, బహిరంగ మలవిసర్జనకు దూరమైన నగరాలంటూ ప్రభుత్వం ప్రకటించిన వాటిలో నిజానికి 1276 నగరాల్లోనే పూర్తిగా పనిచేస్తున్న, నీటి సదుపాయం ఉన్న మరుగుదొడ్లు ఉన్నాయి. పోషకాహారలోపం నుంచి 2022 కల్లా భారతదేశానికి విముక్తి
పొందినట్లుగా ప్రకటించారు. పోషకాహారాన్ని అందించడం లక్ష్యంగా మిషన్‌ ’పోషణ్‌’ పనిచేస్తున్నది. పోషకాహారాన్ని సమకూర్చేందుకు ఒక లక్షా ఎనభై ఒక్కవేల కోట్లు కేటాయించారని లెక్కలు చెబుతు న్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో విడుదలైన గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో మొత్తం 116 దేశాల్లో భారతదేశం 101వ స్థానంలో ఉంది. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ స్కీమ్‌ మరో నిజం బయటపెట్టింది. 15 నుంచి 49 సంవత్సరాల మధ్య ఉన్న మహిళల్లో దాదాపు 57శాతం రక్తహీనతతో బాధపడుతున్నారు. పిల్లల్లో 11శాతం మందికి మాత్రమే సమతుల్యమైన ఆహారం లభ్యమవుతోంది. తక్కువ బరువున్నవారు 32.1 శాతం, ఎదుగు దల ఆగిపోయినవారు 35.5శాతం అంటూ ఈ నివేదిక చాలా వివరాలు తెలియచేసింది. ఏ ప్రభుత్వ మైనా అధికారంలో ఉన్నప్పుడు గొప్పలు చెప్పుకోవడం సమజమే. జీడీపీ అభివృద్ధి ఏటా 5 శాతం ఉంటుంది. ఎందుకంటే, ఈ దేశంలో వ్యవసాయం ప్రైవేటురంగంలో ఉంది, అత్యధిక సేవలు ప్రైవేటురంగంలో ఉన్నాయి, తయారీరంగంలోనూ ప్రైవేటు వాటాయే ఎక్కువ. దేశ జనాభాలో ఇంకా 13శాతం విద్యుత్‌ వినియోగానికి దూరంగానే ఉన్నారు. మ్యూనిచ్‌లో ప్రధానమంత్రి భారతదేశంలోని ప్రతీ గ్రామానికీ విద్యుత్‌ అందుబాటులోకి తెచ్చామని ప్రకటించిన నాడే మరో విచిత్రం జరిగింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న ద్రౌపది ముర్ము స్వగ్రామానికి విద్యుత్‌ సమకూర్చేందుకు అధికారులు అప్పుడు తీగలు వేస్తున్నట్టు ఆ రోజే విూడియాలో వార్తలూ చిత్రాలూ వచ్చాయి. దేశంలోని చాలా గ్రామాలకు, గూడేలకు విద్యుత్‌ ఇంకా చేరవలసి ఉందని గుర్తించడం లేదు. ఇలా నిజాలను దాచి ఏం వెలగబెట్టారన్న దానికి సమాధానం రావడం లేదు. నిజంగానే అభివృద్ది ఎజెండా ఉంటే ఇవన్నీ చేసి చూపాలి.