అబ్బే ! నేనలా అనలేదు
ఎమ్మెల్యేలను బహిష్కరించానని నేనెప్పుడన్నాను
నా వ్యాఖ్యలు మీడియా వక్రీకరించింది
సత్తిబాబు సన్నాయి నొక్కులు
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) :
పార్టీ ఎమ్మెల్యేల బహిష్కరణపై పీసీసీ చీఫ్ మాటమార్చారు. అబ్బే నేను అలా అనలేదు మీడియా మాట మార్చింది అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. బొత్స మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల బహిష్కరణ ప్రకటనపై హైకమాండ్ అక్షింతలు, వైరి వర్గం నుంచి విమర్శలే కారణమని తెలుస్తోంది. నెపం మీడియాపైకి నెట్టడంతో మీడియా ప్రతినిధులు రెట్టించి ప్రశ్నలు అడిగారు. తొమ్మిది మంది ఎవరో పేర్లు చెబుతారా? అని విలేకరులు ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు. ఆ అంశాన్ని రాద్దాంతం చేయొద్దని కోరారు. అవసరమైతే ఆ తొమ్మిది మంది పేర్లను వెల్లడిస్తామన్నారు. తాను ఎమ్మెల్యేలను బహిష్కరించినట్లు చెప్పలేదని, సోనియా నాయకత్వం, కాంగ్రెస్ సిద్ధాంతం ప్రకారం నడుచుకున్న వారే కాంగ్రెస్ ఎమ్మెల్యేలని చెప్పానని, మిగిలిన వారికి, కాంగ్రెస్‌కు సంబంధం లేదన్నానని వివరించారు. రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ వెంటే ఉన్నారని.. అందుకు సహకార ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, రైతుల మద్దతు ఉందని మరోసారి వెల్లడైందని చెప్పారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన వారు కాంగ్రెస్ వారు ఎలా అవుతారని ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను, సోనియా నాయకత్వాన్ని వ్యతిరేకించిన వారంతా పార్టీ బహిష్కృతులేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌ను గద్దె దింపేందుకు కుట్ర చేస్తున్నారన్న పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ వ్యాఖ్యలపై స్పందించేందుకు బొత్స నిరాకరించారు. రైతులకు సంక్షేమ పథకాలు అందించడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, అందుకే వారు తమ వెంట ఉండి సహకార ఎన్నికల్లో గెలిపించారని తెలిపారు. ప్రజల పట్ల కాంగ్రెస్‌పార్టీ చిత్తశుద్ధికి సహకార ఎన్నికలే నిదర్శనమన్నారు. రెండో విడతలో జరిగిన ఎన్నికల్లోనూ తమ పార్టీయే అత్యధిక స్థానాలను గెలుచుకుందని, ప్రతిపక్షాల మోసపూరిత, మాయ మాటలను రైతులను నమ్మలేదన్నారు. సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఆ రెండింటితోనే ముఖ్యమంత్రి కిరణ్ పాలన సాగుతోందన్నారు. ప్రతిపక్షాల మాయమాటలను పట్టించుకోకుండా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. చిన్న చిన్న సమస్యలున్నా, వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. విద్యుత్ సమస్య ఉన్నప్పటికీ, రైతులు తమ వెంటే ఉన్నారని తేలిందని చెప్పారు. ఉత్పత్తితో సంబంధం లేకుండా విద్యుత్ వినియోగం పెరిగిందని, అందువల్లే కరెంట్ సమస్య తలెత్తిందన్నారు. ఎన్నో ఇబ్బందులున్నా సహకార సంఘాల ఎన్నికల్లో గెలుపొందామని, భవిష్యత్‌లో కూడా తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చుకున్నారు. తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని బొత్స స్పష్టం చేశారు. విశాఖపట్నంలో తనకు, తన బంధువులకు 15 ఎకరాల భూమి ఉన్నట్లు ఓ పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని, దాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. తనకు అక్కడ భూమి ఉన్నట్లు నిరూపిస్తే అది వారికే రాసిస్తానన్నారు. తెలంగాణ చాలా సున్నితమైన అంశమని, దీన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని బొత్స తెలిపారు. త్వరలోనే తెలంగాణ సమస్యకు ఓ పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.