అభివాదం చేస్తున్న ప్రజా కూటమి నాయకులు
ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదించాలి….
-మహాకూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది
– కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్
మహబూబాబాద్, నవంబర్ 18(జనంసాక్షి):
రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే ముందస్తు ఎన్నికలతో మరోసారి మోసం చేసేందుకు ముందుకు వచ్చిందని మహకూటమి బలపరచిన కాంగ్రెస్ అభ్యర్ధి పోరిక బలరాంనాయక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్చందర్రరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో బలరాంనాయక్ మాట్లాడారు. రాబోయేది మహాకూటమి ప్రభుత్వమని, మానుకోట నియోజవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కపటనాటకం ఆడిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను ఘోరంగా మోసం చేసిందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడిదారులు, భూకబ్జాదారులు, హంతకులు, మోసకారులను చేర్చుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. రైతుబంధు పేరుతో రైతులను, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. టీఆర్ఎస్ నియంత పాలనను అంతం చేయడం కోసమే మహాకూటమి ఏర్పడిందన్నారు. మహాకూటమి అభ్యర్థులను గెలిపించి టీఆర్ఎస్ పార్టీకి గట్టిబుద్దిచెప్పాలని కోరారు. రైతుబంధు, కళ్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ తన ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలు సంపాదించి వేల కోట్లాది రూపాయలు దండుకున్నారన్నారు. రైతురాజ్యమని చెప్పుకున్న ప్రభుత్వం ఖమ్మం మిర్చి రైతులకు సంకెళ్లు వేసిన విషయం గుర్తులేదా అని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇంటింటికి మంచినీరు అందివ్వకపోతే రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ఎందుకు వస్తున్నారో చెప్పాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వేం నరేందర్రెడ్డి, హరిప్రియ, మూలగుండ్ల వెంకన్న, టీడీపీ నాయకులు కొండపల్లి రాంచందర్రావు, సీపీఐ నాయకులు బి విజయసారధి, అజయ్, టీజేఎస్ నాయకులు పిల్లి సుధాకర్, వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.