అభివృద్ది,సంక్షేమం కెసిఆర్‌ లక్ష్యం

కూటమిది అధికార యావతప్ప మరోటి కాదు

వారికి ఓటేస్తే మళ్లీ వెనకడుగే: వినయ్‌ భాస్కర్‌

హన్మకొండ,నవంబర్‌21(జ‌నంసాక్షి): రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక తమ ఉనికి కోల్పోతామన్న భయంతోనే కాంగ్రెస్‌ పార్టీ అడుగడుగున అభివృద్ధిని అడ్డుకుంటోందని వరంగల్‌ పశ్చిమ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ఇంటింటికీ తిరుగుతూ టీఆర్‌ఎస్‌ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతున్నాయా.. లేదా? అడిగి తెలుసుకున్నారు. మరోమారు గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలను తెలుపుతూ ప్రచారం నిర్వహించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో అభివృద్ధే పరమావధిగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దూసుక పోయిందని అన్నారు. 68 ఏళ్లు పాలించిన గత ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. గతంలో రైతులు విత్తనాల కోసం ఎరువుల కోసం రోడ్డెక్కే పరిస్థితులు ఉండేవని ప్రస్తుతం నాలుగున్నర ఏళ్ల కాలంలో ఏ ఒక్కరోజు రైతులు రోడ్డెక్కలేదని గుర్తు చేశారు.బీసీరుణాలు, బతుకమ్మ చీరలు, గొర్ల కుర్మలకు అందజేసే యూనిట్లను ఇవ్వకుండా కాంగ్రెస్‌ పార్టీ అడ్డుపడిందని ఆరోపించారు. ఎన్నికలు ముగిశాక మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాబోతుందని ఆపిన అభివృద్ధి పథకాలన్ని లబ్ధిదారులకు అందే విధంగా చూస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలోనే మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. కుల వృత్తులను ప్రోత్సహించేలా అనేక పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని పునరుద్ఘాటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు పంట పెట్టుబడితో పాటు రూ.5 లక్షల రైతు బీమా అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ కూలీలకు సైతం రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించేలా టీఆర్‌ఎస్‌ సమాలోచనలు జరుపుతోందని వెల్లడించారు. వేళాపాలా లేకుండా విద్యుత్‌ సరఫరా చేసే వారని ప్రస్తుతం రైతాంగానికి 24 గంటల విద్యుత్‌ అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌దేనన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అత్యధికంగా పింఛన్‌ డబ్బులు పెంచామని, ఈ సారి కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్‌ డబ్బులను రెట్టింపు చేస్తామన్నారు. నిరుద్యోగులకు సైతం రూ.3 వేల భృతి అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.