అభివృద్ది కోసం టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టండి

మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాజెక్టులు పూర్తి

నిరంజన్‌ రెడ్డి పిలుపు

వనపర్తి,నవంబర్‌20(జ‌నంసాక్షి): రాష్ట్ర అభివృద్ధిని గుర్తించి ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్‌ను బలపరచాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే కాంగ్రెస్‌, టీడీపీలు జట్టుకట్టి కూటమిగా తయారై ప్రజలను తికమక పెట్టడానికి వస్తున్నాయని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మన జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేస్తే కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు కేసులు వేసి అడ్డుకుంటున్నారని టీఆర్‌ఎస్‌ నిరంజన్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. సంక్షేమానికి, సంక్షోభానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని, అభివృద్ధికి మరోసారి పట్టంకట్టాలని అన్నారు. రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లుగా ఉద్యమం నడిపిన నాయకుడు కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించిందన్నారు. మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్యసమితిలో గుర్తించడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. డిసెంబర్‌ 7న జరిగే శాసనసభ ఎన్నికల్లో వనపర్తిలో అఖండ విజయాన్ని అందించాలని ప్రజలను కోరారు. గురాష్ట్రంలో కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని, టీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధిని గమనించాలని ఆయన ప్రజలను కోరారు. 70 ఏండ్లు పాలించి తెలంగాణను ఆగం చేసిన పార్టీలు ఏకమై తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి కూటమి పేరుతో కుట్రలు చేస్తున్నాయన్నారు. దీన్ని ప్రజలు గమనించి ఓటు వేయాలన్నారు.