అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాలిముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
శ్రీకాకుళం, జూలై 29 : అభివృద్ధి జరగాలంటే థర్మల్, అణు విద్యుత్‌వంటి పరిశ్రమలు తప్పక రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి గ్రామానికి చిన్నచిన్న అవసరాలకు కూడా విద్యుత్ వినియోగం తప్పనిసరి అయిందని, దీనిని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకోసమే థర్మల్, అణు విద్యుత్ వంటి పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉందన్నారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించిన ఆయన ఆయా పర్యటన వివరాలను ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ పర్యటన తమకు మరింత బాధ్యత పెంచిందన్నారు. జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా ఆరు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించడం వల్ల స్థానికుల అవసరాలు, వారి సాధకబాధకాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగిందని చెప్పారు. మంచినీరు, రోడ్లు తదితరాలు పరిష్కరించగా చేనేత కార్మికుల సమస్యలు, అలాగే రైతుల సమస్యలు, గృహ నిర్మాణానికి సంబంధించిన, వైద్యం, విద్య తదితర సమస్యలు తమ దృష్టికి రాగా వీటిపై హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక రివ్యూ జరిపి వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతామని అన్నారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు పర్యాయాలు వివిధ సందర్భాల్లో శ్రీకాకళం జిల్లా పర్యటనకు వచ్చానని అన్నారు. ప్రస్తుత ఇందిరమ్మ బాట పర్యటనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు చేరుతున్నదీ లేనిదీ, అలాగే ఆయా కార్యక్రమాలు మరింతగా చేరాలంటే తీసుకోవాల్సిన చర్యలు తదితరాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో ఈ మూడు రోజుల పర్యటన తనకు చాలా సంతృప్తిని ఇచ్చిందని, జిల్లా ప్రజలు ఈ పర్యటనలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని చెప్పారు. మంత్రులు థర్మాన ప్రసాదరావు, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళీమోహన్, ఉత్తమ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.