అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదు
నాలుగు మాసాల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
** దసరా తర్వాత ఇళ్ల నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు
,**. మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రసమయి సమగ్ర సమీక్ష
మానకొండూరు ,ఆర్ సి సెప్టెంబర్ 19 ( జనం సాక్షి)
సరిపడా నిధులున్న అభివృద్ధి పనులు నత్త నడకన సాగుతుండటం పై మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు లేదన్నారు. నాలుగు మాసాల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఎంపీటీసీలకు ,సర్పంచ్ లకు సూచించారు. గడువు ముగిసిన తర్వాత సైతం యధాత స్థితి కొనసాగితే, తానే స్వయంగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని ,వెనకంజ వేయడం, రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. సోమవారం స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ ముద్దసాని సులోచన అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో చేపట్టిన గ్రామాభివృద్ధి పనులను అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. త్వరితగతిన అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని, బిల్లుల విషయంలో తానే ప్రత్యేక చొరవ తీసుకుంటానని, ఆందోళన అవసరం లేదన్నారు. మండల పరిధిలోని గ్రామాలలో బిటి రోడ్ల నిర్మాణానికి రూపాయలు 30 కోట్లతో ప్రతిపాదనలు పంపా మన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులు మూల స్తంభాలని అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసి చిన్న చిన్న సమస్యలను అధిగమించి ,పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు. గ్రామాల్లో మౌళిక వసతులు, సిసి రోడ్లు, కుల, మహిళా సంఘ భవనాలు చిన్న చిన్న సమస్యలతో నిలిచిపోతున్నాయని, వీటిపై దృష్టి సారించి వెంటనే పూర్తి చేయాలని సర్పంచ్ ,ఎంపీటీసీలకు సూచించారు. ప్రజా ప్రతినిధులు పలు సమస్యలు దృష్టికి తేగా అధికారులకు సూచనలిచ్చారు. అంతకుముందు వ్యవసాయ , పశు పోషణ , విద్య, విద్యుత్, వైద్య ఆరోగ్య, శ్రీ శిశు సంక్షేమ, పౌరసరఫరా , గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, చిన్న నీటిపారుదల, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. అన్నారం గ్రామంలో చెరువు శిఖం ను సాగుభూమిగా మార్చి చెట్లను తొలగించడంతో పర్యావరణానికి హాని కలగడమే కాక రెండు ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని, ఆ గ్రామ సర్పంచ్ బొట్ల కిషన్ సభలో అధికారులను నిలదీశారు.
త్వరలో హద్దులు నిర్ణయించి సర్వే నంబర్ 819 లో భూమిని పరిశీలిస్తామని, ఆక్రమణ పై సమగ్ర విచారణ జరిపిస్తామని తహశీ ల్దార్ లక్ష్మారెడ్డి బదులిచ్చారు. మండల ప్రజా పరిషత్, తహశీ ల్దార్ కార్యాలయాలలో ఆధార్ సెంటర్లు మంజూరు అయ్యాయని, దీనిపై సభ్యులకు అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఎంపీడీవో దివ్యదర్శన్ రావు సభాముఖంగా అడగడంతో సభ్యులందరూ ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. వెల్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శాశ్వత భవన నిర్మాణానికి కోటి 56 లక్షల రూపాయలు మంజూరయ్యాయని ఈ నిధులు మంజూరుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ఎంపీపీ ముద్దసాని సులోచన కృతజ్ఞతలు తెలియజేశారు. పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు గైరహాజరవటంతో సభ వెల,వెల బోయింది. జిల్లా ప్రాదేశిక సభ్యులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి దివ్యదర్శన్ రావు, తహశీ ల్దార్ లక్ష్మారెడ్డి , మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు వివిధ శాఖ అధికారులు మండల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.