అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఓట్లేయించాయి
కెసిఆర్ పట్ల ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగింది
గ్రామాలను అభివృద్ది చేసుకోవాలన్నదే లక్ష్యం: ఎమ్మెల్యే
మహబూబాబాద్,జనవరి31(జనంసాక్షి): కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే గ్రామాల్లో గులాబీ జెండా ఎగరేలా చేశాయని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. అదే టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు విజయ రహస్యమని అన్నారు. ప్రజలు నిరంతర విద్యుత్‌తో పాటు, మంచినీరు రావాలని, సాగునీరు అందాలని రైతులు కోరుకుంటున్నారని అన్నారు. అందుకే ప్రజలు గంపగుత్తగా కెసిఆర్ వెన్నంటి నడుస్తున్నారని అన్నారు. దీనికితోడు కెసిఆర్ కేసీఆర్ సీఎం అయ్యాకే నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయన్నారు. వివిధ పథకాలు వారిని చేరుతున్నాయని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కెసిఆర్ కిట్ లాంటి పథకాలతో ప్రజల్లో నమ్మకం పెరిగిందని అన్నారు. గ్రామ పంచాయతిల్లో సర్పంచ్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. కెసిఆర్ అండతోనే వెనకబడిన మానుకోట నియోజకవర్గం అన్నిరంగాల్లో అబివృద్దిని సాధించిందన్నారు. ప్రభుత్వ పథకాలకు తెలంగాణ ప్రజలు ఆకర్షితులై గ్రామగ్రామాన టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్‌లుగా భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో వచ్చే ఐదేళ్ళలో రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరుగనుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో గిరిజనులు కూడా గులాబీ పార్టీకే అత్యధిక స్థానాలు గెలిపించి జై కొట్టారు. జిల్లాలోని ఏడు మండలాల్లో ఎన్నికలు జరుగగా బయ్యారం, గార్ల, కొత్తగూడ, గంగారం మండలాల్లో అధిక శాతం గిరిజనులు నివసిస్తుంటారు. దీంతో ఈ మండలాల్లో పోటీ చేసే అవకాశం ప్రభుత్వం గిరిజనులకే కేటాయించింది. పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు అని ఓటు హక్కు ద్వారా తెలియ జేశారు. గతంలో ఏజెన్సీ గ్రామాలు విప్లవ పార్టీలకు కంచు కోటగా ఉండేవి. కానీ , ప్రభుత్వం గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందాలని తండాలను, గూడేలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో గిరిజనుల్లో తమకు మంచి రోజులు రాబోతున్నాయనే నమ్మకం వచ్చింది. అంతేకాకుండా దశాబ్దాల కాలంగా పోడు భూముల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సాగు చేసుకుంటున్న భూములకు కేంద్ర అటవీ హక్కుల చట్టం కారణంగా హక్కు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రచారంలో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ…రానున్న సంవత్సర కాలంలో పోడు రైతుల ఇబ్బందులకు పరిష్కారం చూపిస్తామని ప్రకటించారు. దీంతో, సీఎం మాటపై నమ్మకం పెరిగి టీఆర్ పార్టీ బలపరిచిన వ్యక్తులకే ఓట్లేసి గెలిపించారు. గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వంపై గిరిజనులకు అపార నమ్మకం పెరిగింది. దీంతో ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని శంకర్ నాయక్ అన్నారు.