అమరవీరుల త్యాగాలు మరువలేనివి
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి అక్టోబర్ 21
విధినిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శాంతి భద్రతల పరిరక్షణ, పౌరుల భద్రతకు వారి జీవితాలను తృణప్రాయంగా అర్పించుకున్న పోలీసు అమరవీరులను గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా శుక్రవారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ, విధి నిర్వహణలో తమ కుటుంబాలను సైతం త్యాగం చేస్తూ మన అందరి కోసం పోలీసులు ఎన్నో సేవలు అందిస్తారని అన్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో అందరికంటే ముందు నిలిచి వారి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మనకోసం మన ప్రాణాలు కాపాడేందుకు ఎంతగానో శ్రమించారని గుర్తు చేశారు. పోలీసుల సేవలు మరువలేనివని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటి రెడ్డి మాట్లాడుతూ ప్రపంచమంతా నిద్రపోతుంటే పోలీసులు మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాపలా కాస్తుంటారని అన్నారు. పోలీసుల త్యాగాలను స్మరించుకోనేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసుల సంస్మరణ దినం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఎండనక, వాననక రాత్రి పగలు లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగలను సైతం ప్రజల రక్షణ కోసం త్వజించి, ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించే పోలీసుల త్యాగాల పట్ల సానుభూతి, గౌరవంచూపించడం మనందరి బాధ్యత అన్నారు. కొత్తగా పోలీసు బాధ్యతలు నిర్వహించడానికి ముందుకు వస్తున్న నవతరానికి వారి విధి నిర్వహణలో నూతన ఉత్సాహం స్ఫూర్తిని నింపడానికి పోలీసు అమరవీరుల సంస్మరణ జరుపుకోవడం ప్రధాన ఉద్దేశం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు రషీద్, మురళి డీఎస్పీలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.