అమరవీరుల స్పూర్థి యాత్రకు బ్రేక్‌

– కోదండరాం అరెస్టు

– హైదరాబాద్‌కు తరలింపు

– ఉద్రిక్తత

కామారెడ్డి,ఆగష్టు 11(జనంసాక్షి): ఉద్రిక్త పరిస్థితుల నడుమ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ను పోలీసులు హైదరాబాద్‌ తరలించారు. అమరవీరుల స్ఫూర్తియాత్రలో భాగంగా ఆయన చేపట్టిన యాత్రను పోలీసులు కామారెడ్డి జిల్లా సరిహద్దు బస్వాపూర్‌ వద్ద అడ్డుకున్నారు. అనంతరం ఆయనతో పాటు ఐకాస నేతలను బిక్కనూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడికి ఐకాస నేతలు భారీగా చేరుకోవడంతో పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కోదండరామ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి తరలించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ క్రమంలో కోదండరామ్‌ను పోలీస్‌ జీపు ఎక్కించగా ఐకాస ప్రతినిధులు జీపుగా అడ్డంగా పడుకుని ప్రతిఘటించారు. వారిని చెదరగొట్టిన పోలీసులు కోదండరామ్‌ను హైదరాబాద్‌కు తరలిం చారు. తమ అమరవీరుల స్ఫూర్తి యాత్ర నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని కోదండ రామ్‌ స్పష్టం చేశారు. బిక్కనూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద మాట్లాడిన ఆయన ఉద్యమ ఆకాంక్షలను అమలు చేయా లన్నదే తమ లక్ష్యమని.. ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోవాలన్నదే తమ ఆకాంక్షని చెప్పారు. యాత్ర చేయొద్దనటం చాలా విచిత్రమైన పరిస్థితి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికే విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారని విమర్శించారు. పోలీసుల చర్య అమానుషం, అప్రజాస్వామికం అని మండిపడ్డారు.సిఎం కెసిఆర్‌ నిన్న ఇచ్చిన పిలుపు మేరకు తమను టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని అన్నారు. అయినా తాము ఎలాంటి ఘర్షణకు తావు లేకుండా తమ కార్యకలపాలను సాగిస్తామని అన్నారు. రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం శుక్రవారం నాలుగో విడత అమరవీరుల స్ఫూర్తి యాత్ర రసాభాసగా మారింది. కామారెడ్డి జిల్లా సరిహద్దు బస్వాపూర్‌ వద్ద తెరాస కార్యకర్తలు, రైతులు ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం యాత్ర ముందుకెళ్తున్న క్రమంలో కోదండరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని బిక్కనూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఓ వైపు ఈ గొడవ జరుగుతుండగానే జిల్లా కేంద్రం కామారెడ్డిలో ఐకాస సభ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన టెంట్‌ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. సభ వేదిక వద్దకు విద్యార్థులు, ఐకాస ప్రతినిధులు చేరుకున్నారు. కోదండరాం రాకకోసం ఎదురు చూస్తున్న క్రమంలో తెరాస వర్గీయులు, రైతులు సభాస్థలికి దూసుకొచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు విద్యార్థి సంఘం నాయకులకు గాయాలయ్యాయి. పోలీసులు విద్యార్థి ఐకాస ప్రతినిధులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.