అమరావతిలో ఉద్రిక్తత

2
– తాత్కాలిక రాజధానిలో అపశృతి

తుళ్లూరు,మే10(జనంసాక్షి):గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో సచివాలయ నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కాంక్రీట్‌ కలిపే యంత్రంలో పడి ఓ కార్మికుడు దుర్మరణం చెందాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్‌ కుషినగర్‌ జిల్లా పాండ్రాయన మండలం జంగల్‌పైపరాసి గ్రామానికి చెందిన దేవేంద్ర(22)గా గుర్తించారు. మంగళవారం ఉదయం కాంక్రీటు మిల్లర్‌ను శుభ్రం చేస్తున్న సమయంలో దేవేంద్ర తల మిల్లర్‌లో పడి చితికిపోయింది. మృతదేహాన్ని పోలీసులు హడావిడిగా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మిగతా కార్మికులు కోపోద్రుక్తులయ్యారు. తమకు మృతదేహాన్ని చూపించకుండా రహస్యంగా తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసులను ప్రశ్నిస్తూ… విధ్యంసానికి పాల్పడ్డారు. కార్మికుల దాడిలో క్వార్టర్స్‌లోని 4 కంప్యూటర్లు, మారుతి అంబులెన్సు, మూడు బైక్‌లు ధ్వంసమయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో మరింత మంది పోలీసులు రంగంలోకి దిగారు. కార్మికుల డిమాండ్‌తో దేవేంద్ర మృతదేహాన్ని ఘటనాస్థలికి తీసుకొచ్చారు. కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని కంపెనీ యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. అధికారులు రంగంలోకి దిగి కార్మికులతో జరిపిన చర్చలు సఫలమవడంతో ఆందోళన సద్దుమణిగింది.

కార్మికుడి కుటుంబాన్ని ఆదుకుంటాం

వెలగపూడిలో సచివాలయ నిర్మాణ పనుల్లో కార్మికుడు మృతిచెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విచారం వ్యక్తం చేశారు. కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హావిూ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

విచారణకు ఆదేశం

వెలగపూడి ఘటనపై విచారణకు విచారణకు ఆదేశించినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. కార్మికుడి కుటుంబానికి చంద్రన్న బీమా పథకం కింద రూ.5.2లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

రూ.20లక్షల పరిహారం

వెలగపూడిలో కార్మికుడి మృతితో చెలరేగిన ఘర్షణ సద్దుమణిగింది. మృతుడు దేవేందర్‌కుకు నష్టపరిహారం అందించాలంటూ కార్మికులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ మృతుని బంధువులు, కార్మికులతో చర్చలు జరిపారు. మొత్తం రూ.20లక్షలు నష్ట పరిహారం చెల్లించేందుకు సముఖత చూపడంతో కార్మికులు ఆందోళన విరమించారు. ప్రభుత్వ సహాయం కింద రూ.5.2లక్షలు, ఎల్‌అండ్‌టీ సంస్థ రూ.6లక్షలు, కార్మికుల బీమా పథకం కింద రూ.8లక్షలు మృతుడి కుటుంబ సభ్యులకు చెల్లించనున్నారు. తక్షణ సాయం కింద రూ.2లక్షలు విడుదల చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని జేసీ శ్రీధర్‌ వెల్లడించారు.