అమరుడు యాదయ్య

కుటుంబాన్ని ఆదుకుంటాం
మంత్రి డీకే అరుణ
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
హైదరాబాద్‌/మహబూబ్‌నగర్‌, జూన్‌ 27 (జనంసాక్షి) :
వీరజవాను యాదయ్యకు అంతిమ నివాళులర్పించారు. యాదయ్య మృతదేహానికి అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌ జిల్లా కొండారెడ్డిపల్లిలో పూర్తయ్యాయి. మిలటరీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కొండారెడ్డిపల్లి గ్రామం విషాదంలో మునిగిపోయింది. ఎవర్ని కదిలించినా యాదయ్యను గుర్తు చేసుకుంటూ కంట నీరు పెడుతున్నారు. తమతో గడిపిన క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ శ్రీనగర్‌లో ఉగ్రవాదుల కాల్పులకు బలైన యాదయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. యాదయ్య పిల్లల చదువు నిమిత్తం ప్రతి నెల 1500 రూపాయలు అందజేయనున్నట్టు తెలిపారు. అంతేగాక ఆయన కుటుంబానికి చేయూతనిచ్చేందుకుగాను కొండారెడ్డిపల్లిలో గాని, కల్వకుర్తిలో గాని స్థలం కేటాయిస్తామన్నారు. అలాగే రెండున్నర ఎకరాల భూమి కూడా అందజేయనున్నట్టు తెలిపారు. అంతేగాక మరింత సహాయం అందజేస్తామని కూడా తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి కొండారెడ్డిపల్లికి చేరుకుని యాదయ్య కుటుంబాన్ని ఓదార్చారు. యాదయ్య మృతి పట్ల సంతాపం తెలిపారు. యాదయ్య తల్లికి ఆర్థిక సాయం కింద 50వేల రూపాయలను అందజేశారు.
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో..
శ్రీనగర్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వీర జవాను యాదయ్య మృతదేహానికి సైనికవందనం చేశారు. అనంతరం మహబూబ్‌నగర్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చేర్చారు. యాదయ్య మృత దేహానికి మంత్రి డీకే అరుణ, ఎంపీ మందా జగన్నాధం, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, తదితరులు సంతాపం తెలిపారు. గ్రామస్తుల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచారు. అనంతరం మిలటరీ లాంఛనాలతో యాదయ్య మృతదేహానికి అంతిమ సంస్కారం నిర్వహించారు.