అమర జవాను ముస్తాక్‌ అహ్మద్‌కు కన్నీటి వీడ్కోలు

2

కర్నూలు,ఫిబ్రవరి 16(జనంసాక్షి):దేశం కోసం పోరాడుతూ సియాచిన్‌ మంచు పలకాల కింద కూరుకుపోయి కన్నుమూసిన 9 మంది జవాన్ల అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. అమరవీరులకు పోలీసులు, సైనికులు వందనం చేశారు. అంత్యక్రియలకు ప్రముఖులు హాజరయ్యారు. తమ స్వగ్రామాల్లో అంతిమయాత్ర చేశారు. దేశభక్తిని నరనరానా జీర్ణించుకున్న వీర సైనికులు భరతమాత రక్షణ కోసం ప్రాణాలు వదిలారు. సాహసోపేతమైన విధులను స్వచ్ఛందంగా నిర్వర్తించారు. అత్యంత కఠినమైన ప్రతికూల వాతావరణానికి ఎదురొడ్డి నిలిచారు.  సియాచిన్‌ మంచు పర్వతాల్లో  మరణించిన ఆర్మీ జవాన్‌ ముస్తాక్‌ భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం కర్నూలు జిల్లా నంద్యాల సవిూపంలోని పార్నపల్లెలో ముస్తాక్‌ భౌతికకాయాన్ని కేఈ సందర్శించారు. అనంతరం అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ముస్తాక్‌ కుటుంబసభ్యులకు రూ. 25 లక్షల చెక్కును కేఈ కృష్ణమూర్తి అందజేశారు.  ముస్తాక్‌ అహ్మద్‌ భౌతికకాయానికి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నివాళులర్పించారు. ముస్తాక్‌ మృతి తనను కలచివేసిందని కేఈ అన్నారు. ముస్తాక్‌ అహ్మద్‌ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని హావిూ ఇచ్చారు. ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి , ఎన్‌ఎమ్‌జీ ఫరూఖ్‌, కేఈ ప్రతాప్‌ సహా కలెక్టర్‌ విజయ్‌ మోహన్‌ కూడా ముస్తాక్‌కు నివాళులర్పించారు. ముస్తాక్‌ అంత్యక్రియలకు రాజకీయ నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ముస్తాక్‌ పార్థీవదేహానికి ప్రతిపక్ష నాయకుడువైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఘన నివాళి అర్పించారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఆయన అక్కడే ఉన్నారు. అంతకుముందు పార్నెపల్లిలో నిర్వహించిన ముస్తాక్‌ అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సాహస జవాన్‌ కు అశ్రునయనాలతో కడసారి వీడ్కోలు పలికారు.