అమృతమయం..గీతాసారం!మానవజాతి సంరక్షణే శ్రీకృష్ణుడి పరమావధి!

అమృతమయం..గీతాసారం!మానవజాతి సంరక్షణే శ్రీకృష్ణుడి పరమావధి!
హైదరాబాద్‌, ఆగస్టు 9: పరమాత్మ భగవంతుడై.. భగవంతుడు శ్రీకృష్ణుడై మానవజాతి సంక్షేమం కోసం ద్వాపర యుగాంతంలో మార్గదర్శక సూత్రాలను అందించాడు.. అందుకే శ్రీ కృష్ణుడు పుట్టినరోజు మనకు పండుగరోజు. భగవద్గీత సర్వకాల, సర్వావస్థలలో.. సర్వ మానవులను ఆకర్షిస్తూ ఉంటుంది. ‘గీత’ అంటే ‘గానం’ చేయబడింది.. దాన్నే గీతాశాస్త్రం అని అంటారు. అది మానవజాతిని శాసిస్తుంది. అటువంటి శాసనాన్ని భగవంతుడు తియ్యగా గానం చేశాడు. కఠినమైన పాఠాన్ని శిష్యులకు ఎలా చెప్పాలనే విషయం బోధనా నైపుణ్యం గల గురువుకే తెలుస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు. గీత అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లోని మానవులకు బోధన గ్రంధమైంది. ఎప్పుడెప్పుడు మానవుడు ఆత్మశక్తిని కోల్పోతాడో.. అప్పుడప్పుడు ‘గీత’ నూతన తేజస్సును ఇచ్చి పునర్జీవింపజేస్తు ఉంటుందని స్వామి వివేకానంద వంటి మహనీయులెందరో లోకానికి చాటారు. గీతను వెన్నముద్దలా మనకు ప్రసాదించిన శ్రీకృష్ణభగవానుడికి జన్మదినోత్సవ అభినందనలు తెలుపుకుందాం.
శ్రావణ బహుళ అష్టమినాడు అవతరించిన శిశువే.. శ్రీకృష్ణుడు. కృష్ణావతరం సంపూర్ణావతారం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు లొంగిపోకూడదు. అలా జరిగినప్పుడు పరమాత్మ రూపాన్ని ధరించి భూమిపైకి వచ్చి సరిజేస్తూ ఉంటాడు. ఇదే జగన్నాటకం. జీవాత్మకు ప్రతినిధియైన అర్జునుడి రథాన్ని తానే నడుపుతూ అతనిలోని లోపాలను సవరించడానికి చేసిన బోధ ‘భగవద్గీత’గా నిలిచింది.
దేవకీ వసుదేవులు కృష్ణుని తల్లిదండ్రులు. అన్న బలరాముడు. చెల్లి సుభద్ర. కాని బాల్యంలో కృష్ణ బలరాములు యశోదా నందులవద్ద వ్రేపల్లెలో పెరిగారు. కృష్ణుని తమ్ముడు సాత్యకి.
అష్టమహిషులు..
శ్రీకృష్ణుడు అష్టభార్యలను వివాహమాడాడు. విదర్భ రాజైన భీష్మకుని పుత్రిక రుక్మిణి కృష్ణుడ్ని ప్రేమించింది. కానీ ఆమె సోదరుడు రుక్మిణి నిర్ణయాన్ని విభేదించాడు. ఆమెను శిశుపాలునికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాడు. రుక్మిణి పంపిన రహస్య సందేశం గ్రహించి కృష్ణుడు ఆమె అభీష్టం మేరకు రాక్షస పద్ధతిలో అపహరించి వివాహం చేసుకుంటాడు. సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. కృష్ణుడు శమంతకమణిని తనికిమ్మని కోరగా అతడు అంగీకరించలేదు. ఒకసారి సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహం అతనిని చంపి, మణిని హరించింది. జాంబవంతుడు ఆ సింహన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికిచ్చాడు. మణి కోసం ప్రసేనుడిన్ని కృష్ణుడే హతమార్చాడన్న అపవాదు వ్యాపించింది. కృష్ణుడి కోసం అన్వేషిస్తు పోయి పోయి జాంబవంతుని గుహలో ఉన్న మణిని తీసుకున్నాడు. జాంబవంతునికి మణితో సహా కూతురు జాంబవతిని అతనికి సమర్పించాడు. మణిని తెచ్చి సత్రాజిత్తు నకు ఇచ్చాడు.సత్రాజిత్తు మణితోపాటు తన కుమార్తె సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేశాడు.
కాళింది, భధ్ర, నాగ్నజితి, మిత్రవింద, లక్షణ అతని ఇతర భార్యలు. భధ్ర శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుని చెల్లెలైన శ్రుతకీర్తి పుత్రిక. మిత్రవింద కూడా అవంతీ రాజు పుత్రిక, మేనత్త కూతురు. ఆమెను స్వయంవరంలో వరించి కృష్నుడు చేపట్టాడు. కోసల దేశాధిపతి నగ్నజిత్తుకు ఏనుగుల వంటి బలం కలిగిన ఏడు వృషభాలు ఉండేవి. వాటిని నిగ్రహించిన వానికి తన కుమార్తె నాగ్నజితిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. కృష్ణుడు ఏడు రూపాలు దాల్చి ఏడు ఎద్దులను బంధించాడు. రాజు పుత్రికనిచ్చి పరిణయం చేశాడు. లక్షణ ముద్ర దేశాధిపతి కూతురు. స్వయంవరంలో శ్రీకృష్ణుని వరించింది. ఈ విధంగా కృష్ణుని ఎనిమిది భార్యలు అష్టమహిషులుగా విలసిల్లారు. ఇదిలా ఉంటే శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్రను అర్జునునికి ఇచ్చి పెళ్ళి చేశారు. వారి కొడుకు అభిమన్యుడు.
శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు. రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు. సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభాసుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు కలిగారు. జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్ర జిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. నాగ్నజితి, కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడ, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు. కృష్ణుడికి కాళింది వల్ల శ్రతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భత్రుడు, శాంతి, దర్ముడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు. లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘెషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు,ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది. మిత్రవింద-కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్థణుడు, అన్నాదుడు, మహాశుడు, పానుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు. కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాయుడు, ఆయువు, సత్యకుడి అనే పిల్లలు కలిగారు. ఇదిలా ఉండగా నేడు శ్రీకృష్ణాష్టమి.