అమెరికాతో తెలంగాణకు బలమైన బంధం

3

సీఎం కేసీఆర్‌తో అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ భేటీ

హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జనంసాక్షి): అమెరికాతో తెలంగాణకు చాలా అనుబంధమున్నదని సీఎం కెసిఆర్‌  తెలిపారు. సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలో నిర్మిస్తున్న అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం పురోగతిపై చర్చించారు.  రానున్న కాలంలో ఈ బంధాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు . ఒబామా హెలికాప్టర్‌ విడి భాగాలు హైదరాబాద్‌లోనే తయారు అయ్యాయని సీఎం గుర్తు చేశారు. నూతన పారిశ్రామిక విధానం – ఏకగవాక్ష విధానాన్ని రిచర్డ్‌వర్మకు సీఎం వివరించారు. విద్యుత్‌ అవసరాలు, ఉత్పత్తి వివరాలపై సీఎంను అడిగి వివరాలు తెలుసుకున్నారు వర్మ. అంతే కాకుండా కేంద్రంతో రాష్ట్ర సంబంధాలను, ప్రణాళికల్లో రాష్టాల్ర భాగస్వామ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీతిఆయోగ్‌ ఏర్పాటు, రాష్టాల్ర భాగస్వామ్యంపై వర్మకు సీఎం వివరించారు. అమెరికాతో తెలంగాణకు, హైదరాబాద్‌కు ఎంతో అనుబంధం ఉందని, రానున్న కాలంలో ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు, భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ అభిప్రాయపడ్డారు. సచివాలయంలో మంగళవారం వీరిద్దరు సమావేశమయ్యారు. అమెరికాలోని చాలా విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ విద్యార్ధులు చదువుతున్నారని, అనేక సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, చాలామంది అక్కడే స్థిరపడ్డారని ముఖ్యమంత్రి అన్నారు. అమెరికాకు తెలంగాణ పౌరులు నిత్యం రాకపోకలు సాగిస్తూనే ఉన్నారని అన్నారు. దీనికి రిచర్డ్‌ వర్మ బదులిస్తూ అనేక రంగాలలో తెలంగాణకు అమెరికాకు సంబంధాలు ఉన్నాయన్నారు. అమెరికా అధ్యక్షుని కోసం తయారు చేసే హెలికాప్టర్‌ విడి భాగాలు కూడా హైదరాబాద్‌లోనే తయారయ్యే విషయాన్ని రిచర్డ్‌ వర్మ గుర్తు చేశారు. గచ్చిభౌలిలో కొత్తగా నిర్మిస్తున్న అమెరికా కాన్సులేట్‌ కార్యాలయ పురోగతి గురించి కూడా చర్చించారు. దేశంలో నాలుగు అమెరికా కాన్సులేట్‌ కార్యాలయాలు ఉంటే అందులో ఒకటి హైదరాబాద్‌లోనే ఉండడాన్ని బట్టి తమ దేశం తెలంగాణకు ఇస్తున్న ప్రాధాన్యత అర్ధం అవుతున్నదన్నారు. తమ దేశానికి చెందిన చాలా కంపెనీలు తెలంగాణలో పెట్టబడులు పెడుతున్నాయని, పరిశ్రమలు స్థాపిస్తున్నాయని వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక రంగాలపై దృష్టిపెట్టిందని,వీటిని అమెరికా ప్రభుత్వం, అమెరికా కంపెనీలు నిశితంగా గమనిస్తున్నాయని వర్మ చెప్పారు. తాను కూడా చాలా మంది అధికార, అనధికార ప్రముఖులు, సంస్థలతో సమావేశమయ్యాయని ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానపర నిర్ణయాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై చర్చ జరుగుతున్నదని చెప్పారు. చాలా కార్యక్రమాలు వినూత్నంగా, అభివృద్ది సాధించే దిశగా ఉన్నయని అభినందించారు. ఈసందర్భంగా వివిధ అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలపై వర్మ ముఖ్యమంత్రితో సుదీర్థంగా చర్చించారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంపై అందరి దృష్టి వుందన్నారు. పారిశ్రామికంగా హైదరాబాద్‌కు ఉన్న ప్రత్యేకతలపై ఆరా తీశారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ దేశంలోనే పరిశ్రమలకు అత్యంత అనుకూలమైన ప్రాంతం హైదరాబాద్‌ అని చెప్పారు. ఎన్నో ఏళ్ల నుండి  ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయన్నారు. 1960 నుండే రక్షణ సంబంధ ఉత్పత్తులకు హైదరాబాద్‌ కేంద్రంగా ఉందని చేప్పారు. మిషన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పిలువబడే అబ్దుల్‌ కలాం కూడా హైదరాబాద్‌లోనే పరిశోదనలు చేశారని చెప్పారు. భారత్‌లో తయారయ్యే అన్ని రకాల క్షిపణిలకు కావలసిన భాగాలను హైదరాబాద్‌ అందస్తున్నదని చెప్పారు.

పరిశ్రమలకు హైదరాబాద్‌ సుస్థిర కేంద్రం

పరిశ్రమలకు హైదరాబాద్‌ సుస్థిర కేంద్రం కావడానికి ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, భూ కంపాల లాంటి అతి తీవ్రత కలిగిన ప్రకృతి వైపరీత్యాలకు దూరంగా ఉండడం, సమశీతోష్ణ వాతావరణం కారణమని ముఖ్యమంత్రి చెప్పారు. వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో మరెక్కడా లేని విధంగా పెట్టబడి దారులకు ప్రోత్సహకరంగా ఉండే పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సింగిల్‌విండో విధానం, టిఎస్‌ ఐ పాస్‌ చట్టం, విధి విధానాలను ముఖ్యమంత్రి వారికి వివిరించారు. తెలంగాణలో విద్యుత్‌ అందుబాటు గురించి కూడా వర్మ వివరాలు అడిగారు. ప్రస్తుతం కొంత లోటు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికి  ఈఏడాది చివరి నాటికే తక్షణ అవసరాలు తీరేంత విద్యుత్‌ను సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. రెండు మూడేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా మారుతుందని వెల్లడించారు. జెన్‌కో,ఎన్‌టిపిసి, సోలార్‌, హైడల్‌ చత్తిస్‌గడ్‌ నుంచి వచ్చే విద్యుత్‌ తదితర ప్రణాళికలను ముఖ్యమంత్రి వారికి వివరించారు. దీనికి వర్మ స్పందిస్తూ అధ్బుత ప్రణాళికలతో ముందుకు పోతున్నారని, పారిశ్రమికీకరణకు ఇవి ఎంతగానో దోహదపడతఆయని చెప్పారు. భారత్‌లో కేంద్ర, రాష్టాల్ర మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, ప్రణాళికల్లో రాష్టాల్రకు భాగస్వామ్యం ఉందా, అనే విషయాలను కూడా వర్మ ఆరా తీశారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ కేంద్రంతో తెలంగాణ రాష్టాన్రికి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిన నీతి అయోగ్‌ ద్వారా రాష్టాల్రకు భాగస్వామ్యం పెరిగిందని, ఈ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని, వచ్చే ఏడాది మెట్రో రైలు మొదటి దశ ప్రయాణాలు ప్రారంభం అవుతాయని, మెట్రో రైలును 200 కిలోమిటర్ట వరకు విస్తరిస్తున్నామని, హైదరాబాద్‌లో మరో విమానాశ్రయం నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నమని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజలందరికి సురక్షిత నీరు అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశ్యంతో మంచినీటి పధకాన్ని అమలు చేస్తున్న విషయాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థిరమైన, ప్రణాళికబద్దమైన అభివృద్ది కార్యక్రమాలు తీసుకుంటున్నదని రిచర్డ్‌ వర్మ అభిప్రాయపడ్డారు. తమ దేశం హైదరాబాద్‌తో , తెలంగాణ రాష్ట్రంతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నదని, తమ దేశానికి చెందిన అనేక సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్దం అవుతున్నాయని వెల్లడించారు. తమకు వివిధ వర్గాల నుండి మంచి ఫీడ్‌ బ్యాక్‌ అందిందని చెప్పారు. రిచర్డ్‌ వర్మకు కాకతీయ కీర్తి తోరణాన్ని ముఖ్యమంత్రి బహుకరించారు. ఈసమావేశంలో అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ మైకేల్‌ సి.ములియన్స్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, సిఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.