అమ్మకానికో చిన్నారి…
మహబూబ్ నగర్ : భేటీ బచావో బేటీ పడావో అంటూ నినాదాలొచ్చినా… ఆడపిల్లల సంక్షేమానికి ఎన్ని పథకాలు అమలవుతున్నా ఇంకా అంగట్లో ఆడపిల్లలు దర్శనమిస్తూనే ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అంటేనే కరవు ప్రాంతమని చటుక్కున గుర్తుకొస్తుంది. ఆడపిల్లల పుట్టుకను కూడా కరవు కోరలు శాసిస్తున్న సంఘటనలు జిల్లాలో నెలకొన్నాయి. దీనికి పేదరికం ఒక కారణమయితే ఆడపిల్లలపై వున్న వివక్ష కూడా మరొక కారణం అనుకోవచ్చు. ఆడపిండాల హత్యలతో ఆడజాతి పుట్టుకే ప్రశ్నార్ధకమవుతుంటే..మరోపక్క పుట్టిన బిడ్డలను విక్రయాల రూపంలో వదిలించుకోవటానికి సాక్షాత్తు కన్నవారే ప్రయత్నిస్తున్న దారుణ ఘటనలు జరుగుతున్నాయి. అలాంటి ఘటనే మహబూబ్‌నగర్ డీఈవో కార్యాలయం సమీపంలో చోటు చేసుకుంది. బిజినేపల్లి మండలం లట్టుపల్లికి చెందిన మల్లయ్య మేస్త్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతని మొదటి భార్య వెళ్లిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరు ఆడ పిల్లలున్నారు. రెండో భార్య కూడా వెళ్లిపోవడంతో కుటుంబ పోషణ భారమైంది. నాలుగు నెలల పాపను చూసుకోవడం మరింత కష్టమైంది. విక్రయిస్తే చిన్నారి అక్కడైనా బాగుంటుందని అనుకుని విక్రయానికి పెట్టాడు. స్థానికుల సమాచారంతో అధికారులు పాపను శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.