అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అవంతి
తన పూర్వ జన్మ సుకృతమని వెల్లడి
విజయవాడ,అక్టోబర్8 (జనంసాక్షి) : జగన్మాతను బాలాత్రిపురసుందరిగా దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అనంతరం
విూడియాతో మాట్లాడుతూ భవానీ మాల ప్రతీ సంవత్సరం వేసుకుంటానని తెలిపారు. టెక్నాలజీకి అందని విషయాలు చాలా ఉన్నాయన్నారు. అష్టాదశ శక్తి పీఠాలూ దర్శించుకోవడం తనకు అలవాటని చెప్పుకొచ్చారు. శక్తి అన్ని చోట్లా కొలువుండటంతో రాష్ట్రంలో కష్టాలు లేవన్నారు. కరోనా థర్డ్ వేవ్ రాకుండా చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నానని తెలిపారు. అత్యధిక వ్యాక్సినేషన్, కరోనా టెస్టులు చేసిన రాష్ట్రం ఏపీ అని అన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి చెందేలా చేయాలని సీఎంకు అమ్మవారు శక్తినివ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. దసరా ఉత్సవాలు మైసూరు, విజయవాడలలో జరుగుతున్నాయని మంత్రి అవంతి పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై పాలకమండలి సభ్యుల అత్యుత్సాహం కనిపించింది. దుర్గగుడి ముఖమండపం ముందు పాలకమండలి సభ్యుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీఐపీ, వీవీఐపీ వెళ్లే మార్గంలో పాలకమండలి కోసం ప్రత్యేక సోఫాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. అధికారుల తీరుపై ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే పాలకమండలి సభ్యుల కోసం చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లను తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.