అయారాం.. గయారాంలు శ్రీకప్పల తక్కెళ్లతో ఏంటీ తొండాట?
జెండాలు మోసిన సిన్సియర్ కార్యకర్తలు ఏం కావాలి?
బాబుపై నోరు విప్పనివారు.. టీడీపీ విధానాలు వ్యతిరేకించని వారు
కేవలం పదవులకోసం పార్టీలు మారితే తెలంగాణ ప్రజలు సమర్థిస్తారా?
తెలంగాణ తెస్తారా?
హైదరాబాద్, ఏప్రిల్ 15 (జనంసాక్షి) :
ఉద్యమాల పురిటిగడ్డను అవకాశవాద రాజకీయాలకు వేదికగా మార్చేందుకు స్వార్థశక్తులు కుట్రలు పన్నుతున్నాయి. 2014 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కొందరు బట్టలు మార్చేసినంత సులభంగా పార్టీలు మార్చేస్తున్నారు. వారిని చూసిన ఉద్యమకారులు సిగ్గు పడుతున్నారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా ఏర్పడినట్లుగా చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్ తదుపరి ఎన్నికల్లో ఓట్లు.. సీట్లే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈమేరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆయా పార్టీల నేతలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమపార్టీలో చేరదలిచిన వారు ఈనెల 27లోగా నిర్ణయం తీసుకోవాలని ఆఫర్ ఇచ్చేసారు. ఈ ప్రకటన వచ్చిన మరునాడే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టీడీపీని వీడి గులాబీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. కేసీఆర్‌ను వెదుక్కుంటూ ఒకప్పుడు తాను ఆరోపణలు గుప్పించిన ఫాం హౌస్‌కు చేరుకున్నాడు. కేసీఆర్‌తో భేటీ అయి టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు చెప్పారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌లోకి వస్తామని చాలా మంది మిగతా 2లోక్యూలో ఉన్నారని, కానీ అందరినీ తీసుకోబోమని, తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న వారికి మాత్రమే తమ పార్టీలో చోటుందని పేర్కొన్నారు. ఆయన మాటలు సమస్త తెలంగాణ ప్రజలను నివ్వెర పరిచాయి. 2009లో ఊరువాడ ఏకమై సాధించుకున్న తెలంగాణ ప్రకటనకు అడ్డం పడింది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆ రోజు ఇప్పుడు టీడీపీని వీడుతున్నవారెవ్వరూ ఆయన్ను ఇదేమిటని ప్రశ్నించలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఎందుకు నడుచుకుంటున్నారని అడగలేదు. సీమాంధ్ర, తెలంగాణ తనకు రెండు కళ్లని రెండు కళ్ల సిద్ధాంతం వల్లెవేసినపుడు గతంలో తెలంగాణకు అనుకూలంగా ఎందుకు తీర్మానం చేసారని నిలదీయలేదు. టీడీపీ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా అడుగులు వేస్తుందని, ఇది మంచి పద్ధతి కాదని చంద్రబాబుకు చెప్పే ప్రయత్నం చేయలేదు. అసలు ఆయనకు ఎదురుపడి మాట్లాడే సాహసమే చేయలేదు. శాసనసభ్యులుగా ప్రజల పక్షాన సభలో గళం విప్పే అవకాశమున్నా ఒక్కరోజు కూడా వారి గొంతు పెగల్లేదు. అదే సభలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన ఉద్యమ రణనినాదాలు చేసినా వారిలో చలనం లేదు. ఇంతకాలం తెలంగాణ ప్రజల పక్షాన కనీసం గొంతు విప్పని గంగుల కమలాకర్, ఆయననే అనుసరిస్తున్న మరికొందరు ఎమ్మెల్యేలను కేసీఆర్ తమ పార్టీలో ఎలా చేర్చుకుంటారో అర్థం కాని పరిస్థితి. కేవలం ఎన్నికల్లో లబ్ధికోసం పార్టీలు మార్చే వారితో తెలంగాణ వస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కప్పల తక్కెళ్లతో టీఆర్‌ఎస్ ఆడుతున్న తొండాట ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది? ఇంతకాలం ఆయా సీట్లు ఆశించి ఉద్యమాల్లో భాగస్వాములైన సిన్సియర్ కార్యకర్తల పరిస్థితి ఏమిటి? టీడీపీలో ఉన్నంత కాలం పార్టీ విధానాలను ప్రశ్నించని వారిని, బాబుకు ఎదురు చెప్పని వారిని ఇప్పుడు వీర తెలంగాణవాదులుగా తెరమీదికి తీసుకువస్తే ఫలితం ఏమిటి అనేది అంతుచిక్కడం లేదు. కేవలం పదవుల కోసం పార్టీలు మారే వారిని తెలంగాణ ప్రజలు సమర్థిస్తారా? అంటే ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలని చూస్తున్న తెలంగాణ ఎంపీలు మాత్రం నిఖార్సయి తెలంగాణవాదులుగా పేరుంది. వారు కాంగ్రెస్‌లోనే ఉండి పార్లమెంట్ నిండు సభలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను వ్యక్త పరిచారు. కాంగ్రెస్ తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు. అన్నట్టుగానే పోరు సాగించారు. కేసీఆర్ టీ కాంగ్రెస్ ఎంపీలను, టీడీపీ ఎమ్మెల్యేలను ఒకే ఘాటన కట్టాలని చూస్తే ఫలితం ఏమిటి? ప్రజాస్పందన ఎలా ఉండబోతుంది? అనేవి నిలకడగా తేలనున్నాయి.