అరవింద్‌ పసుపు బోర్డు పట్టుకురా

లేదా రాజీనామా చెయ్‌

రెండే ముచ్చట్లు

రాజీవ్‌ రైతు భరోసా డిమాండ్‌

నిజామాబాద్‌ జనవరి30 (జనంసాక్షి):

అందరి జీవితాల్లో శుభకార్యాలకు వాడే పసుపు.. దాన్ని పండించే రైతుల జీవితాలకు ఉరితాడుగా మారుతోం దని కాంగ్రెస్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పసుపు పంటకు మద్దతు ధరతో పాటు పసుపు బోర్టు ఏర్పాటు కు కృషి చేస్తానని చెప్పిన భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ హావిూ నిలుపుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావంగా ఆర్మూర్‌లో కాంగ్రెస్‌ నేతలు శనివారం ‘రాజీవ్‌ రైతు భరోసా’ దీక్ష చేపట్టారు. శాసనమండలి సభ్యుడు జీవన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీ గౌడ్‌తో పాటు పలువురు నేతలు దీక్షలో కూర్చున్నారు.

ఎంపీ అర్వింద్‌ హావిూ నిలబెట్టుకోవాలి: జీవన్‌రెడ్డి

దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ”పెట్టుబడిని పరిగణనలోకి తీసుకుని మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఆరేళ్ల క్రితం పసుపు పంటకు ఉన్న మద్దతు ధర ఇవాళ లేకపోవడం బాధాకరం. గతంలో ఎంపీగా ఉన్న కవిత ఇచ్చిన హావిూని నెరవేర్చలేకపోయారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్‌ పసుపు బోర్డు తెస్తామని, మద్దతు ధర కల్పిస్తామని రాతపూర్వక హావిూ ఇచ్చారు. రెండేళ్లు గడుస్తున్నా ఆయన ఇచ్చిన హావిూ కార్యరూపం దాల్చ లేదు. ఈ మేరకు బోర్డు ఏర్పాటు చేసి పసుపుకు మద్దతు ధర కల్పించేంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది” అని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. పసుపుపై హావిూలిచ్చి కొందరు పదవులు చేపట్టారని మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో పసుపు రైతుకు మద్దతు ధర లభించిందన్నారు.

రైతాంగాన్ని దగా చేస్తున్నారు: రేవంత్‌రెడ్డి

”నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగమంతా పోరాడుతోంటే.. రైతులకు మొదట మద్దతు తెలిపిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ రాష్ట్ర రైతాంగాన్ని దగా చేస్తున్నారు. రాష్ట్ర రైతులకు, దేశ రైతాంగానికి తలమానికంగా ఉండే నిజామాబాద్‌, ఆర్మూర్‌ రైతులు నేడు కష్టాల కడలిలో మునిగిపోయారు. ప్రభుత్వం చేతిలో మోసపోయి రైతులు శవాలుగా మారుతుంటే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాన్న ఎంపీ అర్వింద్‌ హావిూలు ఏమైపోయాయి” అని ప్రశ్నించారు.

ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ”నిరుద్యోగులకు కోటి కొలువులు, రైతును రాజు చేస్తానన్న సీఎం కేసీఆర్‌ ఇప్పటివరకు చేసిందేవిూ లేదు. ఏకకాలంలో రుణమాఫీ జరగలేదు. రైతులందరూ ఏకమై రైతాంగ ఆకాంక్షలు నెరవేరేలా పోరాటం చేయాలి. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్‌ సమావేశాల్లోనైనా పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నా” అని అన్నారు.