అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు ఇవ్వాలి.
టిడబ్ల్యుజెఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డిమాండ్.
కలెక్టర్ కు వివిధ డిమాండ్ల తో కూడిన వినతిపత్రాన్ని సమర్పించిన నాయకులు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 10(జనంసాక్షి) :
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు నాగర్ కర్నూల్ జిల్లా టిడబ్ల్యుజెఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం “డిమాండ్స్ డే” కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా నాయకులు కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ కు వివిధ డిమాండ్ల తో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా టిడబ్ల్యుజెఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రామచందర్,కాలూరి శ్రీను మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులందరికి ప్రభుత్వం నుంచి ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గత 25 ఏళ్ళుగా జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. చాలామంది జర్నలిస్టులు పేదరికంలో సొంత ఇళ్ళు లేక అద్దె ఇళ్ళల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేలా చూడాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.జర్నలిస్టులకు రైల్వే రాయితీ పాస్ లు పునరుద్ధరించాలని, బస్ పాస్, రైల్వే పాస్ ల పై వంద శాతం రాయితీ కల్పించాలని, ఆర్టీసీ బస్ పాస్ లను జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు వర్తింప చేయాలని కోరారు.రిటైర్డ్ జర్నలిస్టు లకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టులందరికీ జర్నలిస్టు సందు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు దూమర్ల భాస్కర్,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బాదం పరమేష్, జిల్లా కోశాధికారి చారకొండ వెంకటేష్,నాయకులు ఎస్ పి. మల్లికార్జున్,కెఎల్ నారయణరావు, సి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.