అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వసాయం

– రైతుబంధ పథకంతో సన్న, చిన్నకారు రైతుల్లో ఆనందం
– దేశానికే తెలంగాణ పథకాలు ఆదర్శం
– అటవీశాఖ మంత్రి జోగురామన్న
అదిలాబాద్‌, మే26(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ సాయం అందుతదని మంత్రి జోగురామన్న అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. అదిలాబాద్‌ లోని శాంతినగర్‌ షాదిఖానలో జరిగిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆదిలాబాద్‌ అర్బన్‌, రూరల్‌, మవల మండలాల పరిధిలోని 117 మంది లబ్ధిదారులకు మంత్రి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షాదీ ముబారక్‌, కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులు మధ్యవర్తుల మాటలు వినకూడదని సూచించారు. ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని అందించడానికి సిద్దంగా ఉందని, దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని తెలిపారు. ఎవరైనా మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చినా, తీసుకున్నా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడంలో సీఎం కేసీఆర్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌ సీఎంగా పేరు సంపాదించారన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పతకాలను వివరించి, వాటి ఫలాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. రైతుబంధు పథకం చెక్కుల పంపిణీతో చిన్న, సన్న కారు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. గతంలో పంటల సాగు సమయంలో పెట్టుబడి ఖర్చు కోసం రైతులు వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరిగేవారని, దీనిని రూపుమాపేందుకు కేసీఆర్‌ రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.4వేల చొప్పున అందిస్తున్నాడని అన్నారు. దీంతో రైతులు వడ్డీవ్యాపారులు, బ్యాంకుల వద్దకు వెళ్లకుండానే సాగును ప్రారంభించే అవకాశం ఏర్పడిందని, దీంతో రైతులు ఉత్సాహంగా సాగులో పాల్గొంటున్నారని అన్నారు. దీనికితోడు రైతులకు బీమా పథకాన్ని కేసీఆర్‌ అమలు చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల బీమా సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు.

తాజావార్తలు