అలంపూర్ నియోజకవర్గంలో
టిఆర్ఎస్ టికెట్ పై తెచ్చిన గొడవా…?
-టీఆర్ఎస్ శ్రేణుల యుద్ధం…సింగర్ సాయి చందు,అనుచరులపై దాడి..!
గద్వాల ప్రతినిధి సెప్టెంబరు 16 (జనంసాక్షి):-జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య యుద్ధ వాతావరణం ఒకసారిగా బయటపడింది.. అధికార టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు శాంతినగర్ లో భారీ ఎత్తున తెలంగాణ జాతీయ సమైక్యత వజోత్సవ వేడుకలను నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యే అబ్రహం, స్థానిక నేతలందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య వ్యక్తుల ప్రసంగాలు… కార్యక్రమాలు ముగిసే దశలో ఎమ్మెల్యే అబ్రహం తనయుడు అజయ్ కుమార్ సారథ్యంలో కొంతమంది వేదికపైకి దూసుకు వచ్చి సాయి చంద్ ను దుర్భాషలాడుతూ…ఈ కార్యక్రమానికి నీవు ఎందుకు వచ్చావు అని ప్రశ్నించడంతో… ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి ముష్టి యుద్ధాలకు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తనయుని ఆధ్వర్యంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు సాయి చంద్ పై దాడులకు పాల్పడ్డారు. అడ్డువచ్చిన వ్యక్తిగత సిబ్బందిని సైతం తోసి వేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వచ్చినవారికి అలజడి చెలరేగడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. పోలీసులు ఇరు వర్గాలవారిని శాంతింపచేసే ప్రయత్నం చేసినప్పటికిని ప్రయోజనం లేకపోయింది. చివరకు ఎస్కార్ట్ సహాయంతో సాయి చంద్ ను సంఘటనా స్థలం నుండి బయటకు పంపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అబ్రహంకు బదులుగా సాయి చంద్ ను ఎన్నికల బరిలో నిలిపేందుకు అధిష్టానం ప్రయత్నిస్తూ… సాయి చంద్ ను ఇక్కడకు పంపించిందనే అక్కసుతో దాడులు చేసినట్లుగా జిల్లాలో ప్రచారం జరుగుతోంది….