అవగాహనతోనే వ్యాధులు దూరం
కొత్తగూడెం,అక్టోబర్24(జనంసాక్షి): వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. ప్రధానంగా గిరిజన గ్రామాల్లో అవగాహన లేకపోవడం వల్ల అనేకమంది అంటువ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గిరిజన గ్రామాల్లోని ప్రజలకు వ్యాధుల నిర్మూలణపై అవగాహన కల్పించాలని అన్నారు. పారిశుద్య లోపం కూడా ఓ కారణమన్నారు. మురుగునీరు పారుదల సక్రమంగా లేకపోవడం, చెత్త నిర్మూలన చేయకపోవడం వల్ల దోమలు తిష్టవేసి వ్యాధులకు కారకమవుతున్నాయని అన్నారు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎంతో మంది మలేరియా, డెంగీ వ్యాధుల బారిన పడ్డారని గత రెండేళ్ల నుంచి అటువంటి కేసులు తగ్గాయన్నారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి మారుమూల గ్రామాల ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు వారికి పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాధులు సోకితే వారు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునేలా చూడాలని పేర్కొన్నారు. అలాగే వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహనం పెంచాలన్నారు.