అవినీతిరహిత పాలన అందించడంలో సఫలమయ్యాం  

– దేశంలో రాజకీయ సుస్థిర మోడీ వల్లనే సాధ్యం
– ఇంధన ధరల తగ్గింపుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
– విలేకరుల సమావేశంలో బీజేపీ చీఫ్‌ అమిత్‌షా
న్యూఢిల్లీ, మే26(జ‌నం సాక్షి) : అవినీతిరహిత పాలన అందించడంలో ప్రధాని నరేంద్ర మోడీ సఫలమయ్యారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ విజయాలను ఆయన వివరించారు. పేదలు, రైతుల సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ సర్కారు పనిచేస్తుందన్నారు. దేశంలో రాజకీయ సుస్థిర మోడీ వల్లే సాధ్యమైందని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలన్నింటినీ నిలబెట్టుకున్నామని అమిత్‌షా స్పష్టం చేశారు. ప్రధాని ప్రకటించిన హెల్త్‌ స్కీం ద్వారా 10కోట్ల మందికి లబ్ది చేకూరుతుందని అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. అటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడిని దేశానికి అందించిన ఘనత బీజేపీదే అని అమిత్‌ షా అన్నారు. అత్యధికంగా శ్రమించే ప్రధానమంత్రిని బీజేపీ అందించిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రోజులో 15 నుంచి 18 గంటలు పని చేస్తారని తెలిపారు. అలాంటి నాయకుడిని దేశానికి అందించినందుకు బీజేపీ చాలా గర్వపడుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ ఆరోపణలు చేయటానికే పరిమితమవుతుంది తప్ప ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించటంలో విఫలమవుతుందన్నారు. కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాలకు పరిమితమైందని, బీజేపీ విధానం అది కాదని, భారత్‌ను ప్రపంచ దేశాలకు ధీటుగా అభివృద్ధి పర్చటమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు సంతృప్తి చెందేలా బీజేపీ పాలన సాగుతుందని అమిత్‌షా స్పష్టం చేశారు.  సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపైనా షా స్పందించారు. ‘యుద్ధాన్ని భాజపా చివరి అవకాశంగా భావిస్తుంది. ఎటువంటి రక్తపాతం జరగకుండా సరిహద్దులు సురక్షితంగా ఉండాలనే మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. భాజపా హయాంలో ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమయ్యారు’ అని ఆయన పేర్కొన్నారు. ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలపైనా ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతమున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మూడేళ్ల పాటు ఉన్నాయని కానీ, ఇప్పుడు మాత్రం కేవలం కొద్ది రోజులు ఇంధన ధరలు పెరిగిపోతేనే వాళ్లు విసిగిపోతున్నారా అంటూ ప్రశ్నించారు. ఇంధన ధరల తగ్గింపు విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. దీనికి దీర్ఘకాల పరిష్కారం కోసం మోదీ సర్కారు ప్రయత్నిస్తోంది అని షా వెల్లడించారు.