అవినీతి కాంట్రాక్టర్లను సహించేది లేదు

గట్టిగా హెచ్చరించిన కేంద్రమంత్రి  గడ్కరీ
భోపాల్‌,మే19( జ‌నం సాక్షి):   అవినీతికి పాల్పడే కాంట్రాక్టర్లకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. అంతేకాదు, తేడా వస్తే.. బుల్‌డోజర్‌ కింద రాళ్లకు బదులుగా విూరుంటారని ఆయన హెచ్చరించడం గమనార్హం. శనివారం మధ్యప్రదేశ్‌ లో అసంఘటిత కార్మికులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కాంట్రాక్టర్లు రహదారుల పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఒకవేళ కాంట్రాక్టర్లు నిధులు సరిగా వినియోగించకుండా, అవినీతికి పాల్పడితే బుల్‌ డోజర్‌ కింద నలిగిపోయేది రాళ్లు కాదు విూరు’ అంటూ గడ్కరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని సహించేది లేదని స్పష్టం చేశారు. రోడ్లు వేయడానికి ఖర్చు పెడుతున్న సొమ్మంతా విూది కాదని, అది దేశంలోని పేద ప్రజలది అని గుర్తుచేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో రవాణా పురోగతి దూసుకెళ్తుందన్నారు.
—————