అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వండి
సర్కారును గద్దె దించండి తెలంగాణపై ఎమ్మెల్యేలకు జేఏసీ పిలుపు
21న సడక్ బంద్ ఏప్రిల్‌లో చలో అసెంబ్లీ
జేఏసీ చైర్మన్ కోదండరామ్
హైదరాబాద్, మార్చి 14 (జనంసాక్షి):
ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి తెలంగాణ ప్రాంత నేతలంతా కలిసిరావాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా టిటిడిపి, టికాంగ్రెస్ నేతలు అవిశ్వాస తీర్మానానికి అను కూలంగా ముందడుగు వేయాలని ఆయన అన్నారు. ఈ నెల 21వ తేదీన సడక్ బంద్ నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థుల పరీక్షల దృష్ట్యా ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే బంద్‌ను నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్-కర్నూలు హైవే దిగ్బంధనానికి సహకరించాల్సిందిగా జేఏసీ నాయకులు కోదండరామ్ ఆధ్వర్వంలో గురువారంనాడు బిజెపి నేతలను కోరారు. బిజెపి నేతలు జి.కిషన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, యెండల లక్ష్మీనారాయణలతో జేఏసీ నేతలు చర్చించారు. అనంతరం కోదండరామ్ విలేకరులతో మాట్లాడారు. సడక్ బంద్‌కు బిజెపి నేతలు సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వంపై ముప్పేటదాడి చేస్తామని చెప్పారు. సడక్ బంద్ ఈ పోరాటంలో భాగం మాత్రమేనని, ముందుముందు మరింత ఉధృతంగా ఉద్యమం సాగిస్తామని చెప్పారు. ఏప్రిల్ మూడవ వారంలో చలో అసెంబ్లీ నిర్వహి స్తామన్నారు. ఈ కార్యక్రమంతో పాటు విజయవాడ హైవే దిగ్బంధనానికి సంబంధించి తేదీలను త్వరలో ఖరారు చేస్తామని కోదండరామ్ చెప్పారు. తెలంగాణ పరిష్కారానికి ఢిల్లీ పెద్దలు కృషి చేస్తున్న దాఖలాలు లేవని ఆయన విమర్శించారు. ఢిల్లీ నేతలు తలొక్క రీతిలో మాట్లాడుతున్నారని, వారి వ్యాఖ్యలన్నీ బాధ్యతారహితంగా ఉన్నాయని చెప్పారు. ఎన్నికల హామీని, పార్లమెంట్‌లో చేసిన ప్రకటనను ఢిల్లీ పెద్దలు మరిచిపోయారని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణపై ఏకాభిప్రాయం రావాలన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి మాటలను ఆయన ఖండించారు. ఎన్నిసార్లు సమావేశాలు జరిపినా తెలంగాణవాదులంతా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటారని చెప్పారు. ఎప్పటికప్పుడు సీమాంధ్ర నాయకులు తెలంగాణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తన లాబియింగ్ జరిపి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో కేంద్ర పాలకులు విఫలమైతే ఈ ప్రాంత ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రకటించకపోతే కాంగ్రెస్‌కు ఈ ప్రాంతంలో పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందన్నారు. ఆయన ప్రసంగం సాదాసీదాగా ఉందని, ప్రభుత్వాన్ని పొగడానికే పరిమితమైనట్టు ఉందన్నారు. ఎంతోకాలంగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షను, ఆత్మహత్యల ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో లేకపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. టిజేఏసీ కన్వీనర్ శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.