అవి పెట్టు‘బడు’లు

ప్రైవేటు యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చాయి
ఇక ప్రభుత్వరంగంలో నాణ్యమైన విద్య
మోడల్‌ స్కూల్‌ ప్రారంభ కార్యక్రమంలో సీఎం
హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) :
ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు చదువును వ్యాపారంగా మార్చేశాయని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రైవేటు బడులు కావని అవి పెట్టు‘బడు’లని అభివర్ణించారు. శనివారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసిసిలో విద్యా పక్షోత్సవాలను సీఎం ప్రారంభించారు. అలాగే మోడళ్ల స్కూళ్లను ప్రారంభించారు. మోడళ్ల స్కూళ్ల ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు నచ్చిందే చదివించండి.. మీ అభిప్రాయాలను వారిపై రుద్దకండి అని తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి హితవు పలికారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదన్నారు. భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. నేటి విద్యార్థులే.. రేపు మహా పురుషులుగా, విజ్ఞానవంతులుగా రాణిస్తే ఆ ఖ్యాతి తొలుత ఉపాధ్యాయులకే దక్కుతుందన్నారు. దాంతో ఉపాధ్యాయులు తృప్తి చెందుతారన్నారు. ప్రస్తుత రోజుల్లో ఉపాధ్యాయులకు జీతాలు బాగున్నాయన్నారు. మేం చదువుకునే రోజుల్లో బతకలేక బడిపంతులు ఉద్యోగం అనేవారు. విద్యా బోధనలో విద్యార్థుల ప్రశ్నలకు బదులివ్వండి వారికి పాఠం బోధించబోయే ముందు మీరు రెండు గంటల పాటు శ్రమించండి.. దాంతో విద్యార్థుల ప్రశ్నలకు తేలికగా బదులివ్వగలుగుతారని అన్నారు. ఏదైతే చదువుకునేందుకు ఇష్టపడతారో దాన్నే చదివించాలని తల్లిదండ్రులను కోరుతున్నానన్నారు. ఎవరో ఏదో చదువుకున్నారని అలా చదువుకోవడం వల్లే వారు ఆ స్థాయికి వెళ్లారని ఇలా రకరకాల అభిప్రాయాలతో పిల్లలను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. మారిన సమాజానికి అనుగుణంగా మనం కూడా మారాలన్నారు. ‘మన’ నుంచి ‘నాకేమిటి’ అనే రోజులు వచ్చాయన్నారు. సమాజంలో రాను రాను మానవతా విలువలు, కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయన్నారు.  వాటి ఔన్నత్యాన్ని కాపాడేందుకు పత్రికలు ఒకప్పుడు ఎంతో కృషి చేసేవన్నారు. నేడు ఆ చాయలు కొంత మేరకే కనిపిస్తున్నాయని అన్నారు. భారత కుటుంబ వ్యవస్థను విదేశీయులు ఎంతో మెచ్చుకుంటారని అన్నారు. ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల, మగపిల్లవాడు ఉంటే ఇద్దర్నీ సమదృష్టితో పెంచాలని కోరారు. ఏమాత్రం వ్యత్యాసం చూపినా వారి పసి మనస్సుల్లో ఏదో తెలీని వెలితి ఏర్పడుతుందన్నారు. వారిలో ఆ భావాన్ని రానీయకండి. ఒకే తీరున పెంచండి.. వారంతట వారిని ఎదగనీయండ అని తల్లిదండ్రులకు సూచించారు. ఇక ప్రభుత్వరంగంలో నాణ్యమైన విద్యనందిస్తామని తెలిపారు.