అవును! నెల రోజుల్లో కేంద్రం తేల్చేస్తుంది
న్యూఢిల్లీ, జనవరి 2 (జనంసాక్షి) :
నెల రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తేల్చేస్తుందని ఏఐసీసీ అధికారప్రతినిధి రషీద్ అల్వీ తేల్చిచెప్పారు. బుధవారం ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 28న నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పింది కాంగ్రెస్ పార్టీ వైఖరేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణపై తేల్చేది తామేనని స్పష్టం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమాలు జరుగుతున్నా అవి తెలంగాణ ఒక్కటి కావన్నారు. తమకు ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలకమైన రాష్ట్రమని దానిని ఎప్పటికీ ఒదులుకోబోమన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్‌తో తెలంగాణను ముడిపెట్టలేమని చెప్పారు. ఈసారి అఖిలపక్షంలో తీసుకున్న నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు కొన్ని దశాబ్దాలుగా స్వపరిపాలన నినాదంతో పోరాడుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అనిశ్చితి లేదని, ఇంకముందు కూడా తలెత్తబోదన్నారు. దీనిపై ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కరలేదన్నారు. ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. తెలంగాణపై అఖిలపక్షంలో ఆయా పార్టీలు వెల్లడించిన వైఖరి ఆధారంగా నిర్ణయం ఉంటుందని ప్రకటించారు.