అవును.. బెట్టింగ్‌కు పాల్పడ్డా

– రూ. 3కోట్ల దాకా నష్టపోయా

– నేరాన్ని అంగీకరించిన అర్బాజ్‌ఖాన్‌

ముంబాయి, జూన్‌2(జ‌నం సాక్షి) : సల్మాన్‌ఖాన్‌ సోదరుడు, నిర్మాత అర్బాజ్‌ఖాన్‌ ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో బెట్టింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించాడు. శనివారం మహారాష్ట్రలోని థానె పోలీసుల ఎదుట విచారణకు హాజరైన ఆయన తన నేరాన్ని అంగీకరించాడు. ఐపీఎల్‌ బెట్టింగ్‌ కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కావాల్సిందిగా అర్బాజ్‌కు శుక్రవారం పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం విచారణకు హాజరయ్యాడు. గత ఆరేళ్ల నుంచి బుకీ సోను, అర్బాన్‌ ఖాన్‌ ఒకరికొకరు తెలుసని విచారణలో వెల్లడైంది. సోను, అర్బాజ్‌ మధ్య జరిగిన చాటింగ్‌ సమాచారం, బుకీలతో కలిసి వీరిద్దరు దిగిన ఫోటోలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు తెలిపారు. గతేడాది జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో బెట్టింగ్‌ పెట్టి రూ.2.75కోట్లు నష్టపోయినట్లు అర్బాజ్‌ ఖాన్‌ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.విచారణలో సోను అర్బాజ్‌ఖాన్‌ పేరును బయటపెట్టాడు. బెట్టింగ్‌లో రూ.2.8కోట్లు కోల్పోయాడని, ఇవ్వకపోవడంతో బెదిరించానని సోను పోలీసుల విచారణలో వెల్లడించారు. బుకింగ్‌కు పాల్పడుతున్నాడనే ఆరోపణలపై మే 15న సోనుతో పాటు మరో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. జలన్‌ను అరెస్టు చేసిన అనంతరం పోలీసులు అతని వద్ద నుంచి ఓ డైరీ స్వాధీనం చేసుకున్నారు. 100కు పైగా బుకీల ఫోన్‌ నంబర్లు ఆ డైరీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అర్బాజ్‌ ఖాన్‌తో పాటు ఎంతో మంది కాంట్రాక్టర్లు, బిల్డర్లకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు చెప్పారు. సోను పలువురు బడాబాబుల పేర్లను కూడా ఈ విచారణలో బయట పెట్టినట్లు థానె పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఆ పేర్లు ఎవరివి అనేది మాత్రం బయటకు రావడం లేదు. ఇదిలా ఉంటే ఆర్బాన్‌ఖాన్‌ విచారణకు హాజరయ్యారని.. స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశాం అని సీనియర్‌ అధికారి ప్రదీప్‌ శర్మ విూడియాకు వివరించారు. విచారణలో సోనూ యోగేంద్ర జలన్‌తో ఉన్న సంబంధాలపై ఆరాతీశాం. ఫోటోలు చూపించి ప్రశ్నించాం. ఆ సమయంలో జలన్‌ కూడా అక్కడే ఉన్నాడు’ అని శర్మ వెల్లడించారు.