హర్యానా ఎన్నికల్లో వినేష్ ఫొగాట్ విజయం

ఛండీఘర్ : ఒలింపిక్స్ మెడల్ గెలవలేకపోయినా.. తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యే అయింది మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగాట్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరఫున విజయం సాధించడం విశేషం. పారిస్ ఒలింపిక్స్ నుంచి వచ్చిన తర్వాత గత నెలలోనే కాంగ్రెస్ లో చేరిన ఆమె.. అప్పుడే ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయిపోయింది. హర్యానా ఎన్నికల్లో విజయం ఆమెకు ఊరట కలిగించింది. హర్యానాలోని జింద్ జిల్లాలో ఉన్న జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వినేశ్.. బీజేపీ అభ్యర్థి, మాజీ ఇండియన్ ఆర్మీ కెప్టెన్, పైలట్ అయిన యోగేశ్ భజరంగీపై గెలిచింది. వినేశ్ 6 వేల ఓట్లకుపైగా మెజార్టీతో విజయం సాధించడం విశేషం. తొలి రౌండ్లలో ఆమె వెనుకబడినా తర్వాత పుంజుకుంది. హర్యానా నుంచి రాజకీయాల్లో చేరి, ఎన్నికల్లో పోటీ పడిన తొలి మహిళా రెజ్లర్ గా రికార్డు సొంతం చేసుకున్న వినేశ్.. ఇప్పుడీ విజయంతో అసెంబ్లీలో అడుగుపెట్టబోతోంది.