అవ్వ మనోవ్యధ

ఉన్న ఊరు పొమ్మన్నది

పొరుగు రాజ్యం రమ్మన్నది

 

బతుకుదెరువుకు …

దేశంగాని దేశం బోతివి కొడుకా !

 

నువ్వు పోయిన సుంది…

మనుసుల మనుసుంటలేదురా!

 

కన్నపోరల కాయుస్సు కానకపోతివి

కట్టుకున్నదాని ముచ్చట దీర్శకపోతివి

కానని రాజ్యాన కట్టం ఎల్లబోయవడ్తివి

 

నువ్వు  యాదికచ్చినప్పుడల్ల ..

కండ్లు “ఊట” సెలిమలైతన్నయి

కడుపుల పేగులు వడిబెడ్తన్నయ్

 

ఏ సప్పుడు ఇనచ్చినా

నీ అడుగుల అలికిడి తలపిత్తాంది

 

సాదుకపు మేకపిల్ల సుతం

నువ్వుబోయిన దారుల కాస్తంది

 

నీ మీద “మనాది” తోని …

తిన్నకూడు పెయినబడ్తలేద్రయ్యా

 

మనున్నం ఆన్నట్లేగని …

పాణం నీ మీదికే కొట్టుకుంటంది

 

నువ్వు లేకుంట

కూర బువ్వలేక్కడియి

పండుగ పబ్బాలెక్కడియిరా

 

నువ్వు కండ్ల ముందరుంటేనే

ముసలి పాణాలకు సంబరం బిడ్డా !

 

మేం జీవిడిసినంక ఆగ్గిబట్టకుంటే

గాపాపం పిల్లలకు సుట్టుకుంటది

 

ఎవ్వలకు అక్కరకురాని ఎడారి

బతుకులు మనకెందుకు కొడుకా ?

 

కలో గంజో కలిసే తాగుదాం

కట్టమో ,సుఖమో కలిసే బతుకుదాం

నా మాటిని జల్దిన బైలెల్లిరార కొడుకా !

           “”””””””””””””””

( వలస జీవుల వెతల చిత్రం ఆవిష్కరిస్తూ…)

                               కోడిగూటి తిరుపతి

                               Mbl no: 9573929493