అశాంతి సృష్టించేది విూరే…

ఫిర్యాదు చేసేది విూరే
– రాష్ట్రంపై పరోక్షంగా పెత్తనం చేయాలన్నదే బీజేపీ కుట్ర
– వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీదే అధికారం
– పవన్‌ పార్టీకి సింగిల్‌ డిజిట్‌ కూడా రాదు
– రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు
అమరావతి, జులై4(జ‌నం సాక్షి ) :  బీజేపీ, వైసీపీ, జనసేన కుట్రరాజకీయాలు చేస్తున్నాయని, రాష్ట్రంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు చేస్తూ మళ్లీ వారే రాష్ట్రంలో అశాంతి నెలకొందని ప్రచారం చేస్తున్నారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి పాలన పెట్టాలని గవర్నర్‌కు బీజేపీ వినతి నమ్మకద్రోహానికి పరాకాష్ట అని అన్నారు. ఢిల్లీ డైరెక్షన్‌లోనే ఏపీ బీజేపీ నేతల రాష్ట్రపతి పాలన డిమాండ్‌ అని అన్నారు. రాష్ట్రంపై పరోక్షంగా పెత్తనం చేయాలన్నదే బీజేపీ హైకమాండ్‌ కుట్ర అని మంత్రి ఆరోపించారు. అశాంతి సృష్టించేది తమరే.. శాంతిభద్రతలపై ఫిర్యాదు చేసేది తమరే అని మండిపడ్డారు. పవన్‌కళ్యాణ్‌తో ఉత్తరాంధ్ర ఉద్యమం అని రెచ్చగొట్టిస్తారని, జగన్‌తో కులాల చిచ్చు రగిలించాలని చూస్తారని మంత్రి యనమల వ్యాఖ్యానించారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రానివ్వం అన్న పవన్‌ కల్యాణ్‌ మాటల్లోనే లాలూచి తెలిసిపోతోందని మంత్రి వ్యాఖ్యానించారు. 2009లో అన్నదమ్ములు, బావమరదులు, మేనళ్లుల్లు అందరూ కలిసి ప్రచారం చేశారని… ప్రజారాజ్యం ప్రభుత్వం వస్తుందని అప్పట్లో చెప్పారని… కానీ 18 శాతం కూడా ఓట్లు రాలేదన్న ఆయన… ఇప్పుడు జనసేన పార్టీ పేరుతో పడన్‌ ఒక్కడే ప్రచారం… కాబట్టి సింగిల్‌ డిజిట్‌ కూడా రాదని జోస్యం చెప్పారు. ఐదు నెలల క్రితం టీడీపీని పొగిడి ఇప్పుడు విమర్శించడం బీజేపీ డైరక్షన్‌లో కాదా? అని పవన్‌ను యనమల ప్రశ్నించారు. ఆర్ధిక ఇబ్బందులున్నా పేదలకు ఇంత సంక్షేమం చేస్తే పవన్‌కు కనిపించలేదా..? అంటూ మండిపడ్డారు. ఇక పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేసినందునే తాము అధికారంలోకి రాలేదని యనమల స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పోలిస్తే బీజేపీతో కలిశాక మాకు 20 సీట్లు తగ్గాయని గుర్తుచేశారు. ఓవైపు వైసీపీ నేతలు పీఎంవో చుట్టూ తిరుగుతారు… మరోవైపు పవన్‌ కళ్యాణ్‌… బీజేపీతో ఉంటారు… లెఫ్ట్‌ పార్టీలతో విూటింగ్‌లు పెడతారని ఎద్దేవా చేశారు. బిజెపితో ఉంటారా?… లెఫ్ట్‌ తో ఉంటారా? పవన్‌ స్పష్టం చేయాలని యనమల సూచించారు. కేంద్రంపై, బీజేపీపై పవన్‌ కళ్యాణ్‌ ఒక్కమాట కూడా ఎందుకని మాట్లాడరు? అని ప్రశ్నించారు. పవన్‌, జగన్‌… ఎంతమంది వచ్చినా టీడీపీని అడ్డుకునే శక్తిలేదని యనమల స్పష్టం చేశారు.