అశోక్‌ గజపతిరాజుకు జిల్లా సమస్యలు పట్టవా?

– జిల్లాకు గిరిజన యూనివర్శిటీ, మెడికల్‌ కళాశాల ఏమైంది
– వీటిపై ఎంపీ ఎందుకు పోరాడటం లేదు
– ఇవి సాధించకుండా.. కడప స్టీల్‌ ఫ్యాక్టరీకోసం పోరాడటం హాస్యాస్పంద
– వైసీపీ జిల్లా సమన్వయకర్త శ్రీనివాసరావు
విజయనగరం, జూన్‌28(జ‌నం సాక్షి) : కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్‌ గజపతి రాజుకు జిల్లా సమస్యలు పట్టడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కడప ఉక్కు కోసం సంతకాల సేకరణ చేపట్టిన గజపతి రాజు, విభజన సమయంలో జిల్లాకు ఇచ్చిన హావిూలపై ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. జిల్లాకు గిరిజన విశ్వ విద్యాలయం ఇస్తామని చెప్పి మోసగించారని, యూనివర్సిటీ గిరజనుల హక్కు అని, వాటిపై పోరాడాలని అనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు. విభజన సమయంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఇప్పటి వరకూ అమలు కాలేదని ఈ విషయంపై అశోక్‌ గజపతి రాజు ఎందుకు పోరాటం చేయడం లేదని శ్రీనివాసరావు నిలదీశారు. విభజన చట్టంలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని ఉందని, కేంద్రంలో భాగస్వామిగా ఉండి పదవులు అనుభవించిన ఎంపీ సంతకాల సేకరణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. జిల్లాకు లబ్ధి చేకూర్చే అంశాలను విస్మరించిన ఎంపీకి కడప ఉక్కు పరిశ్రమకై పోరాడే అర్హత లేదని విమర్శించారు. అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు గాజులు చేయిస్తానని చెప్పినట్లు, ఓటు వేసి గెలిపించిన జిల్లా ప్రజలకు న్యాయం చేయలేని అశోక్‌ గజపతి రాజు.. కడప ఉక్కు పరిశ్రమ కోస పోరాడటం హాస్యాస్పదంగా ఉందని శ్రీనివాసరావు తెలిన్నారు. టీడీపీ పాలనకు చరమ గీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని, రానున్న ఎన్నికల్లో గజపతి రాజుకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.