అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు
ముంబయి: అభిమాననటుడికి ప్రజలు, చిత్రపరిశ్రమ అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. ఈ రోజు ఉదయం నుంచే రాజేశ్ ఖన్నా స్వగృహం ముందు ఆయనను చివరిసారిగా చూసి నివాళులర్పించేందుకు అభిమానులు బారులు తీరారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయక అలాగే నిలబడ్డారు. తెల్లని పూలతో,రాజేశ్ ఖన్నా చిత్రాల నలుపు తెలుపు ఫొటోలతో అలంకరించిన వాహనంపై ఆయన పార్థివదేహాన్ని విలెపార్లెలోని శ్మశానానికి వూరేగింపుగా తీసుకెళ్లారు. భార్య డింపుల్, పెద్దల్లుడు అక్షయ్‌కుమార్, చిన్న కుమార్తె రింకీ ఖన్నా కూడా వెంటవున్నారు. అక్షయ్ భార్య ట్వింకిల్ గర్భిణి కావడంతో ఆమె రాలేదు. వీరి కుమారుడు తొమ్మిదేళ్ల ఆరవ్ రాజేశ్ ఖన్నా చితికి నిప్పంటించాడు. అమితాబ్ బచ్చన్, మనోజ్‌కుమార్‌లతో సహా బాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు రాజేశ్ ఖన్నా అంతిమ యాత్రలో పాల్గొన్నారు. చివరి క్షణం వరకూ కూడా అభిమానుల్ని నియంత్రించడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. కొన్నిసార్లు లాఠీచార్జి కూడా చేయాల్సివచ్చింది.