అసమ్మతి నేతలకు బుజ్జగింపులు

మంత్రి తుమ్మల నెత్తిన బాధ్యతలు
ప్రచారంలో ప్రకటిత అభ్యర్థులు
ఖమ్మం,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన విషయంలో రగులుకున్న అసమ్మతిని చల్లార్చేందుకు పార్టీ నాయకులు ఒకవైపు రంగంలోకి దిగుతున్నా.. మరోవైపు అసమ్మతి నేతలు మెట్టు దిగకుండా తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నాయకులు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. సత్తుపల్లి, వైరా, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లో అసమ్మతి కార్యకలాపాలు వేడెక్కుతుండటంతో పార్టీ విజయం కోసం అధినేత  కెసిఆర్‌ ప్రకటించిన అభ్యర్థుల గెలుపునకు జిల్లా నేతలు ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బుజ్జగింపులు చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతను స్వీకరించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై పలు నియోజకవర్గాల నేతలు ఆశలు పెట్టుకున్నారు. అసమ్మతి నేతలకు నచ్చజెప్పి.. దారిలోకి తెచ్చే బాధ్యతను తుమ్మలపై పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌ ఎంపిక చేసిన సత్తుపల్లి అభ్యర్థి పిడమర్తి రవిని గెలిపించుకోలేకపోతే తాను వచ్చే మంత్రివర్గంలో ఉండటమే అనవసరమని వ్యాఖ్యానించడంతో పార్టీ కార్యకర్తలు.. నేతల్లోనూ ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగమేనని, తనకోసం పని చేయాలని నియోజకవర్గంలో అసమ్మతి నేతలకు సైతం పరోక్షంగా చెప్పినట్లయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సత్తుపల్లిలో టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌
ఆశించిన మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్‌ తనకు టికెట్‌ రాకపోవడంతో భవిష్యత్‌ కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను కలవడం, సభలు, సమావేశాలు, మోటారు సైకిల్‌ ర్యాలీలు చేపట్టారు.   తనకు ప్రజలతో ఉన్న సంబంధాలు, కార్యకర్తల అండ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే మంత్రి తుమ్మలకు రాజకీయ భవిష్యత్‌ను ప్రసాదించిన సత్తుపల్లి నియోజకవర్గంలో అధినేత బలపరిచిన అభ్యర్థి పిడమర్తి రవిని గెలిపించాలని గట్టిగా చెబుతున్నారు. ఇక
మధిర నియోజకవర్గంలోనూ అక్కడి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.  వైరా నియోజకవర్గంలో ప్రస్తుత
ఎమ్మెల్యే బాణోత్‌ మదన్‌లాల్‌పై అక్కడి నేతలు కొందరు రగిలించిన అసమ్మతి అగ్గి ఇప్పటికిప్పుడు సమసిపోయేలా కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో దశలవారీగా పర్యటనలు చేయడం ద్వారా పార్టీ పరిస్థితులను ఆకళింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి నియోజకవర్గం లోనూ టీఆర్‌ఎస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు, కొన్నిచోట్ల వర్గ పోరును తుదముట్టించాలని, ఇందుకోసం తమ ప్రాంతాల్లో పర్యటించాలని వస్తున్న విజ్ఞప్తులపై తుమ్మల ఆచితూచి స్పందిస్తున్నారు.  నేతలంతా ఐక్యంగా పనిచేయాలని భరోసా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ నియోజకవర్గాల్లో కొంత అసంతృప్తి, అసమ్మతి వంటి పరిస్థితులున్నా.. ప్రకటించిన అభ్యర్థులు ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. ఖమ్మం తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆత్మీయ సమావేశాల పేరుతో నగరంలోని ప్రతి డివిజన్‌లో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను కలిసి ప్రచార పర్వాన్ని వేడెక్కిస్తుండగా.. సత్తుపల్లిలో పిడమర్తి రవి, మధిరలో లింగాల కమల్‌రాజ్‌, వైరాలో బాణోతు మదన్‌లాల్‌, పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టడం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇల్లెందు నియోజకవర్గంలోనూ టీఆర్‌ఎస్‌ అధికారిక అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు సైతం అసమ్మతి సెగలు తప్పడం లేదు.