అసెంబ్లీ నిరవధిక వాయిదా

మూజువాణి ఓటుతో ద్రవ్య బిల్లు ఆమోదం
హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి) :
వాయిదాల పర్వం ముగిసింది.. శాసనసభ నిరవధికంగా వాయిదా పడిరది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం కూడా సభ సజావుగా సాగలేదు. విపక్షాల ఆందోళనలతో పలుమార్లు వాయిదా పడిరది. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం శాసనసభ లభించింది. నిరసనల మధ్యే సభ మూజువాణి ఓటుతో ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించింది. రోజూలాగే చివరి రోజు కూడా తెలంగాణ అంశంపై సభలో గందరగోళం నెలకొంది. తెలంగాణ తీర్మానం చేయాలంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీంతో సభ మూడుసార్లు వాయిదా పడిరది. అంతకు ముందు ఉదయం సభ సమావేశం కాగానే విపక్షాలు వివిధ అంశాలపై ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తోసిపుచ్చారు. తెలంగాణ అంశంపై టీఆర్‌ఎస్‌, నాగం జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే కేటీఆర్‌ అక్రమాలపై టీడీపీ, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, వయో పరిమితి పెంపుపై వైఎస్సార్‌సీపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మతపరమైన రిజర్వేషన్ల కారణంగా బీసీలకు కలిగే నష్టంపై బీజేపీ, ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై సీపీఐ వాయిదా తీర్మానాలివ్వగా, వాటన్నింటినీ స్పీకర్‌ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. గందరగోళం మధ్యే ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. అయితే, విపక్ష సభ్యులు ఆందోళనలు ఉద్ధృతంచేయడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు, టీఆర్‌ఎస్‌, టీడీపీ సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో సమావేశాలకు తీవ్ర ఆటంకం కలగడంతో స్పీకర్‌ సభను అరగంట పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన అనంతరం అదే పరిస్థితి నెలకొంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పోడియాన్ని చుట్టుముట్టారు. మరోవైపు, టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు చేసిన వ్యాఖ్యలు సభకు అంతరాయం కలిగించాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని తొలగించాలని కాంగ్రెస్‌ పట్టుబట్టడంతో డిప్యూటీ స్పీకర్‌ భట్టివిక్రమార్క గాలి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. అయితే, సభలో గందరగోళం కొనసాగడంతో మరోమారు వాయిదా పడిరది. ఆ తర్వాత సభ సమావేశం కాగానే, టీఆర్‌ఎస్‌ సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. తెలంగాన తీర్మానం చేయాలని నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్‌ కోరినా ఫలితం లేకపోయింది. దీంతో మరో 15 నిమిషాలు సభ వాయిదా పడిరది. తిరిగి ప్రారంభమైన అనంతరం అదే పరిస్థితి మళ్లీ పునరావృతమైంది. స్పీకర్‌ ఆదేశాల మేరకు విపక్షాల నినాదాల మధ్యే ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఎలాంటి చర్చ లేకుండానే సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. అప్పటికీ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆందోళన కొనసాగించడంతో స్పీకర్‌ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.