అహింసా, సత్యాగ్రహాల్లో జాతికి ఆదర్శం
-బాపు చిరస్మరణీయం: సీఎం కేసీఆర్
హైదరాబాద్, జనవరి30,జనంసాక్షి:
అహింస, సత్యాగ్రహ మార్గాలను చిత్తశుద్దితో పాటించి అవే ఊపిరిగా జీవించిన జాతిపిత గాంధీజీ చిరస్మర ణీయుడని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కొనియాడారు. మత సామరస్యం, పరమత సహనం కోసం గాంధీజీ ప్రాణత్యాగం చేశారని ఆయన పేర్కొన్నారు. జాతిపిత మహా త్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ము ఖ్యమంత్రి గాంధీని స్మరించుకున్నారు. ఈ మేరకు బాపూఘాట్ వద్ద ముఖ్య మంత్రి కెసిఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ వర్దంతి సందర్భంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు
ముఖ్యమంత్రి బాపూఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. ఇదిలావుంటే జాతిపిత మహాత్మగాంధీ ప్రపంచానికే ఆదర్శ నాయకుడని, ఆయన ఆశయాలు, సిద్దాంతాలు ప్రపంచమే ఆచరించిందని తెలంగాణ ప్రదేశ్ కంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మహాత్మాగాంధీ 67వ వర్ధంతి సందర్భంగా ఆయన శుక్రవారం బాపుఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం గాంధీభవన్‌లో మహత్మాగాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అహింసా సిద్దాంతంతో రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించి వారిని దేశం నుంచి తరిమే వరకు పోరాడిన మహనీయుడు గాంధీ, ఆయన జీవితం ప్రపంచానికి ఆదర్శం, ఆయన వేసిన బాట సర్వదా ఆచరణీయం అన్నారు. నేడు ప్రపంచమంతా గాంధీయిజంగురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి ఉప నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఓబామా ఇండియాకు వచ్చి మాకు గాంధీ ఆశయాలు ఆదర్శమని చెబుతుంటే మన ఎన్‌డిఎ ప్రభుత్వ నేతలు గాడ్సేకు గుడి కట్టే వ్యూహల్లో ఉన్నారని ఇది ఎంత దుర్మార్గమో ప్రజలు అర్ధం చేసుకోవాలని విమర్శించారు. గాంధీయిజాన్ని ప్రపంచమంతా ఆచరించే పరిస్థితులుంటే ఇక్కడ గాడ్సేయిజాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. మహాత్మున్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నా,గాడ్సేకు గుడి కడుతామని హిందు మత సంస్థలు ప్రకటనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం చూస్తు ఊరుకుంటుందని ఇది భారత జాతికి మంచిది కాదని ఆయన అన్నారు. ఇలాంటి విషయాలను మొగ్గలోనే తుంచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పి అంజన్‌కుమార్ యాదవ్, క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి, పిసిసి అధికార ప్రతినిధి నిరంజన్‌లతోపాటు రాష్ట్ర నాయకులు చరన్, బాలాజీ, నరేందర్ యాదవ్, రామలింగం తదితరులు పాల్గొన్నారు.