ఆందోళన చెందవద్దు – అప్రమత్తంగా ఉండాలి
ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది
* ఎంత పెద్ద విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం
* ఎప్పటికప్పుడు వరద పరిస్థితి తెలుసుకుంటున్నాము.
* అధికార యంత్రాంగం ఫీల్డ్ లొనే ఉన్నారు
*మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) :
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు , వరదలకు నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ప్రజలు ఆందోళన చెందవద్దని వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
బుధవారం నగరంలోని కిసాన్ నగర్ ,క్రిష్ణ నగర్, అశోక్ నగర్ ,అలకపురి కాలనీ ,తదితర ప్రాంతాల్లో నగర మేయర్ వై సునీల్ రావు తో కలసి లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. వరద బాధితులను పరామర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఉండి ఎప్పటికప్పుడు వరద పరిస్థితులను తెలుసుకుని ఉన్నామని అన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, వాగులు నిండి మత్తడి దూకుతున్నయని రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అధికార యంత్రాంగం అంతా గ్రామాల్లోనే ఉండి ఎప్పటికప్పుడు వరద పరిస్థితులను తెలుసుకుని తమ దృష్టికి తీసుకు వస్తుందని మంత్రి పేర్కొన్నారు. కొన్ని చోట్ల భారీ వర్షాలకు పురాతన ఇండ్లు కూలి పోయాయని అటువంటి వాటిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి నిరాశ్రయులు అయిన వారికి ప్రభుత్వ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
జిల్లాలో చాలా చోట్ల పంట నీట మునిగిందని , వరద ప్రవాహం తగ్గిన వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని మంత్రి పేర్కొన్నారు.పంట నష్టం పై ప్రభుత్వం తుది నివేదిక రాగానే నష్టపోయిన రైతాంగానికి పరిహారం అందుతుందని తెలిపారు. వర్షాలతో ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని అన్నారు. విఆర్వో స్థాయినుండి ఎమ్మార్వో పోలీస్ సిబ్బంది అంతా గ్రామాల్లో ఉండి పరిస్థితులను తమకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారని మంత్రి తెలిపారు.కరీంనగర్ పట్టణంలో చాలాచోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయని నగరపాలక సంస్థ కమిషనర్ మేయర్ ఎప్పటికప్పుడు వరదనీరు తొలగిస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.